అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా గల్లంతు కాకూడదు…

Sakshitha news

అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా గల్లంతు కాకూడదు…

‘సర్’ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్…

గోదావరిఖని: ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ ఐ ఆర్ ) ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు.

ఎన్‌టీపీసీలోని కాకతీయ కళాతోరణంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ ఐ ఆర్ ) ప్రక్రియ పురోగతిపై బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు)తో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని, సమర్థవంతమైన ప్రజా ప్రతినిధిని ఎన్నుకునేందుకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండాలని అన్నారు. ఓటరు జాబితా ప్రక్షాళనలో నిర్లక్ష్యం కారణంగా అర్హత ఉన్న ఒక్క వ్యక్తి కూడా ఓటు హక్కు కోల్పోతే అది ప్రజాస్వామ్య వ్యవస్థకు తీరని నష్టమని పేర్కొన్నారు.

రామగుండం నియోజకవర్గంలో సుమారు 80 వేల ఓట్లు జాబితా నుంచి గల్లంతయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని నివారించేందుకు బీఎల్‌వోలు తప్పనిసరిగా ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయడంతో పాటు వాటిని పూరించడంలో ఓటర్లకు అవగాహన కల్పించి, వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును పరిరక్షించాలని సూచించారు.

సర్ ప్రక్రియ విజయవంతం కావాలంటే స్థానిక ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీల బీఎల్‌ఏలు, స్వచ్ఛంద సేవకులు, ప్రజలు బీఎల్‌వోలకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ ప్రక్రియలో పాల్గొంటున్న అంగన్‌వాడీ కార్యకర్తలుగా విధులు నిర్వహిస్తున్న బీఎల్‌వోలకు రోజువారీ విధుల్లో కొంత సడలింపు కల్పించాలని సూచించారు.

దశాబ్దాల క్రితం వలస వచ్చి పీకే రామయ్య కాలనీ, ఒరియా కాలనీల్లో స్థిరపడిన వారికి కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డులు జారీ చేయడంతో పాటు ఓటు హక్కు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

ఈ సందర్భంగా నగర మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ, సర్ ప్రక్రియ పూర్తయిన కొన్ని రాష్ట్రాల్లో లక్షలాది మంది ఓటు హక్కు కోల్పోయిన ఉదాహరణలు ఉన్నాయని, అలాంటి పరిస్థితి తెలంగాణలో తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా సర్ ప్రక్రియను పూర్తి చేసేందుకు వార్డు అధికారులు, వార్డు అసిస్టెంట్లు, కార్పొరేటర్లు, బీఎల్‌ఏలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తాను కూడా కమిషనర్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రక్రియను సమీక్షిస్తానని తెలిపారు.

అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జె. అరుణశ్రీ మాట్లాడుతూ, ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని శుక్రవారం లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఫారాలు పూరించడంలో బీఎల్‌వోలు ఓటర్లకు సహకరించాలని సూచించారు. ప్రస్తుతం ఓటు ఉండి, సర్ ప్రక్రియ అనంతరం జూలై 31న. విడుదలయ్యే ముసాయిదా ఓటరు జాబితాలో పేరు లేకపోతే సంబంధిత ఓటరుకు నోటీసు జారీ చేస్తామని తెలిపారు. నోటీసుకు స్పందించి ఎన్నికల సంఘం నిర్దేశించిన పత్రాలను సమర్పిస్తే ఓటు పునరుద్ధరణకు అవకాశం ఉంటుందని, అవసరమైతే ఎన్నికల సంఘం సీఈఓకు కూడా అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఉందని వివరించారు.

అనంతరం బీఎల్‌వోలకు సర్ యాప్ వినియోగంపై శిక్షకుడు అనిల్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ప్రజాప్రతినిధులు అడిగిన పలు సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.

ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, ఎంఆర్వో రవీందర్, కార్పొరేటర్లు, నాయకులు, బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top