జీజీహెచ్‌లో నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యం ….

Sakshitha news

జీజీహెచ్‌లో నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యం ….

గోదావరిఖని జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష…

సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి: పెద్దపల్లి, గోదావరిఖని జనరల్ ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.

గోదావరిఖని (రామగుండం) ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా క్రిటికల్ కేర్ సెంటర్, అన్ని వార్డులు, ఇన్‌పేషెంట్ (ఐపీ) విభాగం, ప్రయోగశాలలు, ఎక్స్‌రే విభాగం, ఆసుపత్రి ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలు, పారిశుద్ధ్య నిర్వహణ, అందుబాటులో ఉన్న సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఆసుపత్రిలో ప్రతిరోజు నిర్వహిస్తున్న ఎక్స్‌రే పరీక్షల నివేదికను తప్పనిసరిగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సమర్పించాలని ఆదేశించారు.

ప్రస్తుతం ఉన్న లిఫ్ట్‌ను మాన్యువల్ ఆపరేషన్ విధానంలోకి మార్చేందుకు తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ద్వారా చర్యలు చేపట్టాలని, అలాగే కొత్త లిఫ్ట్ ఏర్పాటు చేయడంతో పాటు భద్రత దృష్ట్యా ఆరు గ్రిల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.

ఆసుపత్రికి అవసరమైన రెండు ఫ్యూమిగేటర్లు, రెండు కంప్యూటర్లు, రెండు రిఫ్రిజిరేటర్లు, ప్రయోగశాలకు ఐదు యూపీఎస్‌లు, ఒక ప్రింటర్ కొనుగోలు చేసేలా టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ద్వారా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఆసుపత్రిలో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను త్వరితగతిన కల్పించి ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

ఈ తనిఖీలో ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హిమబిందు, ఆర్‌ఎంఓ డాక్టర్ కృపాబాయి, వైద్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Scroll to Top