42 ఏళ్ల అక్షరయజ్ఞానికి ఘన వీడ్కోలు…
వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన గురువుకు ఘన సన్మానం…
సాక్షిత జనగామ:
విద్యార్థుల భవిష్యత్ వికాసమే లక్ష్యంగా 42 సంవత్సరాల 6 నెలల పాటు విద్యారంగానికి విశిష్ట సేవలందించిన జనగామ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ అసిస్టెంట్ (బయోసైన్స్) శ్రీమతి కాజ పద్మారాణి మంగళవారం పదవీ విరమణ పొందారు. నాలుగు దశాబ్దాలకు పైగా వేలాది మంది విద్యార్థులకు జ్ఞానబోధన చేసి, వారి జీవితాలకు మార్గదర్శకురాలిగా నిలిచిన ఆమె సేవలను ఈ సందర్భంగా పలువురు కొనియాడారు.
కర్నూలు జిల్లా బి.వి.నగర్‌కు చెందిన కాజ ప్రమీలాదేవి, వెంకట సుబ్బారావు దంపతుల రెండో కుమార్తెగా 1965 జూన్ 6న జన్మించిన పద్మారాణి చిన్ననాటి నుంచే విద్యాభ్యాసంలో ప్రతిభ కనబరిచారు. కర్నూలు, నిజామాబాద్ జిల్లాల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేసి, చందూరులో పదో తరగతి, గుంటూరులో ఇంటర్మీడియట్, మహబూబ్‌నగర్‌లో టీటీసీ, కరీంనగర్లో డిగ్రీ, తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో బీఈడీ పూర్తి చేశారు.
1984లో ప్రారంభమైన ఉపాధ్యాయ ప్రస్థానం
1984 జనవరి 4న నిజామాబాద్ జిల్లా ఘన్పూర్ ప్రాథమిక పాఠశాలలో స్పెషల్ టీచర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆమె, 1985 జనవరి 29న ఎల్లారెడ్డి జెడ్పీహెచ్ఎస్లో ఎస్జీటీగా సర్వీసు క్రమబద్ధీకరణ పొందారు. అనంతరం రామగుండం, గోదావరిఖని బాలికల పాఠశాలల్లో సేవలందించారు. 2006 మార్చి 3న జీవశాస్త్ర స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది గంగారం, అంతర్గాం పాఠశాలల్లో పనిచేశారు. 2018 జూలై 9న జనగామ జెడ్పీహెచ్‌ఎస్‌కు బదిలీపై వచ్చి పదవీ విరమణ వరకు విశిష్ట సేవలందించారు.
ప్రయోగాత్మక బోధనతో ప్రత్యేక గుర్తింపు
సైన్స్ వంటి క్లిష్టమైన అంశాలను సులభంగా అర్థమయ్యేలా ప్రయోగాత్మక పద్ధతిలో బోధించడం ఆమె ప్రత్యేకత. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలను అలవరచడంలోనూ ఆమె విశేష కృషి చేశారు.
నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం
‘నొప్పించక… తానొవ్వక’ అనే జీవన తత్వాన్ని ఆచరిస్తూ కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహించిన పద్మారాణి ఆదర్శ ఉపాధ్యాయురాలిగా, ఉత్తమ గృహిణిగా గుర్తింపు పొందారు. పిల్లలు ప్రత్యూష, ప్రబోధ్లను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది ఆదర్శ తల్లిగా నిలిచారు.
భావోద్వేగాల మధ్య ఘన సన్మానం
పదవీ విరమణ సందర్భంగా జనగామ జెడ్పీహెచ్ఎస్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ ప్రతినిధులు, విద్యార్థులు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థిని టీచర్ దుర్గం ప్రమీల నగేష్ దంపతులు శాలువాతో సత్కరించి, “అసాధారణ ప్రతిభాసీలి డాక్టర్ అంబేద్కర్” పుస్తకాన్ని బహూకరించారు. అనంతరం ఆత్మీయులు శాలువాలు కప్పి, పూలమాలలు వేసి, జ్ఞాపిక అందజేసి ఘనంగా సత్కరించారు.
సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆమె సేవలను స్మరించుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. నాలుగు దశాబ్దాలకు పైగా విద్యా సేవలతో అనేకమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన కాజ పద్మారాణి శేష జీవితం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో కొనసాగాలని పలువురు ఆకాంక్షించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
