పక్షవాతంతో మంచానికే పరిమితమైన కళాకారుడు కొమురయ్యకు అండగా చీకటి అంజన్న….
సీఎంఆర్ఎఫ్ సహాయం తక్షణమే అందించాలని సీపీఐ డిమాండ్….
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: గోదావరిఖని, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 6వ డివిజన్ జనగామకు చెందిన సీనియర్ కళాకారుడు, సీపీఐ డివిజన్ నాయకుడు, తెలంగాణ ప్రజానాట్యమండలి కళాకారుడు కామ్రేడ్ సంబోధు కొమురయ్య గత ఏడాదిగా పక్షవాతంతో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యారు. కాలు, చేయి పనిచేయక ఉపాధి కోల్పోయిన ఆయన కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
విషయం తెలుసుకున్న సింగరేణి ఉద్యోగి, సీనియర్ కళాకారుడు, తెలంగాణ ప్రజానాట్యమండలి కళాకారుడు కామ్రేడ్ చీకటి అంజన్న శుక్రవారం కొమురయ్య నివాసానికి వెళ్లి పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా అంజన్న మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో ప్రజా చైతన్యానికి కొమురయ్య తన కళతో విశేష సేవలందించారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి, కుటుంబ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని పేర్కొన్నారు. ప్రతి నెలా మందులు, వైద్య చికిత్సకు వేలాది రూపాయలు ఖర్చవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, తోటి కళాకారులు, కళాభిమానులు, దాతలు ముందుకు వచ్చి కొమురయ్యకు ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు తొడుపునూరి రమేశ్ కుమార్ మాట్లాడుతూ, కొమురయ్య చికిత్స కోసం లక్షల రూపాయలు అప్పులు చేసి రెండు సార్లు మెదడు శస్త్రచికిత్స చేయించుకున్నప్పటికీ ఇంకా పూర్తిగా కోలుకోలేదన్నారు. సంవత్సరం క్రితం స్థానిక ఎమ్మెల్యే ద్వారా సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి సహాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే వెంటనే స్పందించి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జనగామ సీనియర్ కళాకారుడు ఆరెల్లి వెంకటి పాల్గొన్నారు.
