విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం.. నాణ్యమైన ఆహారం, సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి….
నంది మేడారం గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: ధర్మారం,
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంతో పాటు వారి సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.
ధర్మారం మండలంలోని నంది మేడారం గ్రామంలో ఉన్న టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్/జూనియర్ కాలేజీ (బాలికలు) పాఠశాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారికి అందిస్తున్న ఆహార నాణ్యత, వసతులను పరిశీలించారు.
విద్యార్థులకు అందించే ఆహార పదార్థాల నాణ్యతను అత్యుత్తమ ప్రమాణాలతో నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాల ప్రాంగణం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి విద్యార్థి శారీరక ఎదుగుదల, విద్యా ప్రగతి, క్రీడలు, ఇతర సహపాఠ్య కార్యక్రమాల్లో పాల్గొనే తీరును నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొన్నారు.
వంటశాల పరిసరాలను పరిశుభ్రంగా నిర్వహించడంతో పాటు ఆహార పదార్థాలను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిల్వ చేయాలని సూచించారు. వంట ప్రక్రియను పరిశుభ్రత ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించి, విద్యార్థులకు రుచికరమైన, పోషక విలువలు కలిగిన ఆహారం అందేలా చూడాలని ఆదేశించారు.
అనంతరం ధర్మారం ఎంపీడీవో కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు వివరాలు పరిశీలించి, కార్యాలయ పని వేళల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సమయపాలన పాటించాలని సూచించారు. ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు.
ఈ పర్యటనలో ధర్మారం తహసీల్దార్ శ్రీనివాస్, టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ ప్రిన్సిపాల్ పద్మ తదితర అధికారులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
