కేతి బచావో” అభియాన్తో రైతులకు అవగాహన – ప్రత్యామ్నాయ పంటల సాగుపై వ్యవసాయ అధికారుల సూచనలు…
కేతి బచావో (పొలాలను రక్షించండి) అభియాన్ కార్యక్రమం నిర్వహించిన మండల వ్యవసాయ అధికారి కే. సతీష్ కుమార్
సాక్షిత పెద్దపల్లి// జిల్లాప్రతినిధి: అంతర్గం మండలంలోని అంతర్గం, ముర్మూర్, ఎల్లంపల్లి, కుందనపల్లి గ్రామాల్లో “కేతి బచావో” (పొలాలను రక్షించండి) అభియాన్ కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి కే. సతీష్ కుమార్ నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రస్తుత వానాకాలంలో సాగు చేయాల్సిన పంటలు, వాటికి వాడాల్సిన మందులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. పంటల ఎంపికలో రైతులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
పచ్చిరొట్ట ఎరువులు, సేంద్రీయ ఎరువులు వాడి నేల భూసారాన్ని పెంపొందించాలని, యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో ఎరువులు, నీటిలో కరిగే ఎరువులు వినియోగించాలని సూచించారు. అలాగే పంట వ్యర్థాలను కాల్చకుండా భూమిలో కలియదున్ని ఎస్ఎస్పి ఎరువు చల్లి సేంద్రియ ఎరువుగా మార్చుకోవాలని రైతులకు వివరించారు.
ఎల్నినో వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరి, పత్తికి ప్రత్యామ్నాయంగా పెసర, కంది, మినుము, బొబ్బెర, నువ్వులు, చిరుధాన్యాల సాగు చేపట్టాలని సూచించారు. తప్పనిసరిగా వరి సాగు చేయాల్సి వస్తే తక్కువ కాలంలో దిగుబడి ఇచ్చే వరి రకాలను మాత్రమే సాగు చేయాలని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం, రైస్ మిల్లర్లు సూచించిన మార్కెట్ డిమాండ్ ఉన్న సన్న వరి రకాలను మాత్రమే రైతులు సాగు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ముర్మూర్ సర్పంచ్ మగ్గిడి స్వరూప – శ్రీనివాస్, ఎల్లంపల్లి సర్పంచ్ ఆరుముల్ల మాధవి, కుందనపల్లి సర్పంచ్ ఆర్కుటి కొమురయ్య, రెవెన్యూ తహశీల్దార్ పడాలవర ప్రసాదరావు, మండల ప్రజా పరిషత్ అధికారి గాంధీరావుపేట తిరుపతి, పంచాయతీ కార్యదర్శి ఎస్. కమల, వివిధ శాఖల అధికారులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
