ధాన్యం తరలింపులో వేగం పెంచాం – చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం…
రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు….
–ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:
పెద్దపల్లి నియోజకవర్గంలోని అన్ని కొనుగోలు కేంద్రాల నుంచి వరి ధాన్యాన్ని పూర్తిస్థాయిలో తరలించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసిందని, రైతులు ఎవరూ అధైర్యపడవద్దని తెలంగాణ ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు అన్నారు.
పెద్దపల్లి పట్టణంలోని చీకురాయి రోడ్డులో గల రైస్ మిల్లు గోదాంలో నిల్వ ఉంచిన వరి ధాన్యాన్ని స్థానిక నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే విజయరమణ రావు , నియోజకవర్గంలోని కొనుగోలు కేంద్రాల నుంచి ఇప్పటికే 98 శాతం ధాన్యాన్ని తరలించామని తెలిపారు.
పెద్దపల్లి, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లో లారీల జాప్యం, హమాలీల కొరత కారణంగా కొంత ధాన్యం మిగిలి ఉందని పేర్కొన్నారు. మిగిలిన ధాన్యాన్ని త్వరితగతిన తరలించేందుకు పెద్దపల్లి, సుల్తానాబాద్ లారీ అసోసియేషన్ అధ్యక్షులు భారీ, తిరుపతి, శ్రీనివాస్, సతీష్‌లతో చర్చించినట్లు తెలిపారు. అలాగే పెద్దపల్లి, సుల్తానాబాద్ సీఐలు ప్రవీణ్, రంజిత్, ఎస్ఐలు, పోలీసు అధికారులు, సిబ్బంది సహకారంతో పూర్తి స్థాయిలో ధాన్యం లిఫ్టింగ్ చేపడుతున్నామని చెప్పారు.
హమాలీల కొరత నివారణకు అదనంగా మరికొంతమంది హమాలీలతో మాట్లాడామని, పెద్దకల్వల సంతు, నరేష్ సహకారంతో రాత్రి వేళల్లో కూడా ధాన్యం లోడింగ్, అన్లోడింగ్ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో ధాన్యాన్ని గోదాములకు, రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.
పెద్దపల్లి, కాల్వ శ్రీరాంపూర్, ఓదెల, జూలపల్లి మండలాల్లో మిగిలి ఉన్న ధాన్యాన్ని రెండు రోజుల్లో పూర్తిగా లిఫ్ట్ చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కేరళకు రుతుపవనాలు చేరిన నేపథ్యంలో వర్షాల ప్రభావం పడకముందే ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
అలాగే నియోజకవర్గంలో మక్కల కొనుగోళ్లు కూడా పూర్తిస్థాయిలో కొనసాగుతున్నాయని, కొనుగోలు చేసిన మక్కలను అవసరమైన ప్రాంతాలకు తరలిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, పలు గ్రామాల సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
