సమాజ సేవలో విశిష్ట సేవలు అందించిన పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు….
కుటుంబంతో ఆనందంగా గడపాలి : పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం,
తమ కుటుంబ క్షేమం కంటే సమాజ క్షేమం కోసం నిరంతరం విధులు నిర్వహించేది పోలీసులు మాత్రమేనని, ప్రస్తుతం ఉద్యోగ విరమణ పొందుతున్న అధికారులు ఇకపై తమ కుటుంబ సభ్యుల కోసం ఎక్కువ సమయం కేటాయించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్లో సుదీర్ఘకాలం పాటు విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన ఎస్ఐ కె. వేణుగోపాల్, ఏఎస్ఐ ఎం. సురేందర్ రెడ్డిలను పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. పూలమాలలు వేసి జ్ఞాపికలను అందజేసి వారి సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఉద్యోగ విరమణ పొందుతున్న అధికారులు తమ విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారని, కొన్ని సందర్భాల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తించారని తెలిపారు.
ఇలాంటి అధికారులు రాబోయే తరం పోలీసులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని పేర్కొన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రతిరోజూ యోగ లేదా వ్యాయామం చేయాలని సూచించారు. అలాగే కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతూ సుఖసంతోషాలతో జీవితాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, పరిపాలనాధికారి శ్రీనివాస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ రమేష్, రామగుండం పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు బోర్లకుంట పోచలింగం, పదవీ విరమణ పొందిన అధికారుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
