బాల్య వివాహాల నిర్మూలనలో పెద్దపల్లి జిల్లా ఆదర్శం
జిల్లాను బాల్య వివాహాల రహిత జిల్లాగా ప్రకటించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష…..
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:
పెద్దపల్లి జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనతో పాటు మహిళా సాధికారత, అక్షరాస్యత పెంపు కోసం చేపట్టిన కార్యక్రమాలు విశేష ఫలితాలను సాధించాయని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు.
99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్నేహ కిశోర బాలికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాక్ పార్లమెంట్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. ప్రజలతో చర్చించి, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని విధానాలను రూపొందించడమే ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పతనమని పేర్కొన్నారు. ప్రజల సూచనలు, భాగస్వామ్యం లేకుండా తీసుకువచ్చే మార్పులు ఎక్కువ కాలం నిలవవని అన్నారు.
జిల్లాలోని మహిళా సంఘాల్లో చదువు రాని మహిళలను ఉల్లాస్ కార్యక్రమం కింద నమోదు చేసి, ఐదు వేల మంది వాలంటీర్ల సహకారంతో అక్షరాస్యత బోధించినట్లు తెలిపారు. మార్చి నెలలో నిర్వహించిన పరీక్షలకు 34,620 మంది మహిళలు హాజరై 100 శాతం ఉత్తీర్ణత సాధించడం జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. మిగిలిన 35 వేల మంది మహిళలకు జూలై నెలలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా అధికారులు, వాలంటీర్లు, మహిళా సంఘాల సభ్యుల కృషిని ప్రత్యేకంగా అభినందించారు.
అనంతరం జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, 14 మండలాల పరిధిలోని 263 గ్రామ పంచాయతీల్లో ఎక్కడా బాల్య వివాహాలు జరగడం లేదని ధృవీకరిస్తూ పెద్దపల్లి జిల్లాను బాల్య వివాహాల రహిత జిల్లాగా ప్రకటించారు.
మహిళలపై జరిగే అఘాయిత్యాలు, వేధింపులు, వివక్షను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మహిళల భద్రత, గౌరవ పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కాళీందిని, జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్, అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్, సంబంధిత అధికారులు, స్నేహ కిశోర బాలికల సంఘం సభ్యులు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
