దొంగతనం కేసులో ఆటో డ్రైవర్ అరెస్ట్
18 గ్రాముల బంగారం, ఆటో స్వాధీనం
సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు గుర్తింపు
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి: మహిళను ఆటోలో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బెదిరించి బంగారు పుస్తెలతాడు దొంగతనం చేసిన కేసులో సూర్యాపేట పట్టణ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 18 గ్రాముల బంగారు పుస్తెలతాడు మరియు ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చివ్వెంల మండల కేంద్రానికి చెందిన 65 ఏళ్ల మహిళ ధనలక్ష్మి, ఖమ్మం అండర్‌పాస్ వద్ద వాహనాల కోసం ఎదురుచూస్తుండగా, ఆటో డ్రైవర్ ఆమెను ఎక్కించుకుని ఖమ్మం రోడ్డులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు.
అక్కడ పోలీసులు తనిఖీలు చేస్తున్నారని నమ్మబలికి, అనంతరం కత్తితో బెదిరించి ఆమె మెడలో ఉన్న 18 గ్రాముల బంగారు పుస్తెలతాడును దోచుకుని అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఈ ఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సూర్యాపేట పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి ఆటో నంబర్ AP 24 TC 5480గా గుర్తించారు. ఆ ఆధారంగా నిందితుడు ఆత్మకూరు మండలం కోటపాడు గ్రామానికి చెందిన భూతం మహేష్ (22)గా గుర్తించారు. నిందితుడు సూర్యాపేట పట్టణంలోని శ్రీనివాసనగర్‌లో అద్దె ఇంటిలో నివసిస్తూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
తనకు పరిచయమైన తిరుపతమ్మకు డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. నమ్మదగిన సమాచారంతో ఎస్సై వెంకన్న ఆధ్వర్యంలో పోలీసు బృందం శ్రీనివాసనగర్‌లోని నిందితుడి నివాసానికి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకుంది. అతని వద్ద నుంచి దొంగిలించిన బంగారం, ఆటోను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన ఎస్సై వెంకన్న, సిబ్బంది శ్రీరాములు, రామనర్సయ్య, అలాగే టెక్నికల్ టీం సభ్యులను సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య అభినందించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
