పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం – అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నాం : ఎమ్మెల్యే నాగరాజు …
ఐనవోలు మండలానికి చెందిన 48 మంది కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులకు రూ.48.05 లక్షల చెక్కులు పంపిణీ…
సీఎంఆర్ఎఫ్ ద్వారా 25 మంది లబ్ధిదారులకు రూ.6.25 లక్షల ఆర్థిక సహాయం అందజేత…
హన్మకొండ సుబేదారి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఐనవోలు మండలానికి చెందిన కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల లబ్ధిదారులకు, అలాగే ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన చెక్కులను వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ఘనంగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల కింద 48 మంది లబ్ధిదారులకు రూ.48,05,568 విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. అదేవిధంగా అనారోగ్య సమస్యలు, అత్యవసర వైద్య చికిత్సల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన 25 చెక్కులను, మొత్తం రూ.6,25,300 విలువైన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేశారు…
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ముఖ్యంగా పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలు ఆర్థిక భారంగా మారకుండా ఉండేందుకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలు ఎంతో మేలు చేస్తున్నాయని తెలిపారు. ఈ పథకాల ద్వారా వేలాది కుటుంబాలకు ప్రభుత్వం ప్రత్యక్ష ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు.
అలాగే సాధారణ కుటుంబాలు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న సమయంలో ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరంలా మారిందన్నారు. అత్యవసర వైద్య ఖర్చులు భరించలేని పేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తూ వారి కుటుంబాలకు అండగా నిలుస్తోందని చెప్పారు. ప్రజల కష్టసుఖాల్లో ప్రభుత్వం ఎల్లప్పుడూ భాగస్వామిగా ఉంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు…
వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమమే తన ప్రధాన బాధ్యతగా భావిస్తున్నానని ఎమ్మెల్యే నాగరాజు పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించి, అర్హులైన వారందరికీ సకాలంలో ప్రయోజనాలు అందేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు. గ్రామ స్థాయి నుంచి ప్రజల
సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించే విధంగా పని చేయాలని అధికారులకు సూచించారు…
ప్రజా పాలనలో పారదర్శకత, సేవాభావంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, పేదల అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు…
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
