యండ్లపల్లి లో వ్యవసాయ అనుబంధ శాఖల వారోత్సవాలు
పశుసంవర్ధక రంగాలకు ప్రాధాన్యం పెరుగుతోంది : డాక్టర్ బట్టు గోపి
….
సాక్షిత, సూర్యాపేట జిల్లా ప్రతినిధి:
తెలంగాణలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, పశుసంవర్ధక రంగాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం” లో భాగంగా వ్యవసాయ అనుబంధ శాఖల వారోత్సవాలు గ్రామస్థాయిలో విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సూర్యాపేట మండలం యండ్లపల్లి గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశువైద్య నిపుణులు డాక్టర్ బట్టు గోపి, డాక్టర్ ఎ. అనీల్ కుమార్ పాల్గొని పశువులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
పశువులకు అవసరమైన చికిత్సలు అందించడంతో పాటు దూడలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. అదేవిధంగా రైతులకు పశుగ్రాస విత్తనాలు అందజేసి, ఎండాకాలంలో పశువుల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. నీటి కొరత, ఆహార లోపం వంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ టి. సుధీర్, ఉప సర్పంచ్ ఆది నారాయణ, గ్రామ పంచాయతీ కార్యదర్శి, హార్టికల్చర్ అధికారి సుధాకర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి బి. కృష్ణ సందీప్, ఏఈఓ జాన్సీతో పాటు పశుసంవర్ధక శాఖ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పశుసంవర్ధక రంగం కీలక పాత్ర పోషిస్తోందని, ఇలాంటి శిబిరాలు రైతులకు నేరుగా లాభం చేకూర్చే విధంగా ఉంటాయని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాలను రైతులు పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
