స్థానిక ఖిల్లా లోని జాఫర్ బావిని పర్యాటక ప్రాంతంగా తీర్చిద్దితున్నము.
-జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
సాక్షిత ఖమ్మం :
స్థానిక ఖిల్లా లోని జాఫర్ బావిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దనున్నట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. బుధవారం కలెక్టర్ జాఫర్ బావి పూడికతీత పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఖిల్లా చరిత్ర, జాఫర్ బావి చరిత్ర అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెత్తా చెదారం తో బావి నిండి ఉందని, చెత్త, పూడిక తొలగింపు పనులు జరుగుతున్నట్లు తెలిపారు. పూడికతీత తర్వాత బావి, పరిసరాల సుందరీకరణ పనులు చేపట్టాలన్నారు. కెమికల్ ట్రీట్మెంట్ చేపట్టాలని ఆయన అన్నారు. ఖిలాలో పిచ్చి చెట్లు, పొదలు తొలగించి లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. చుట్టుపక్కల నుండి మురుగునీరు, చెత్తాచెదారం రాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. సిసి కెమెరాల ఏర్పాటుచేయాలన్నారు. ప్రాంతం సుందరీకరణ, అభివృద్ధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి, చైతన్యం తేవాలన్నారు. పనులకు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాల తరలింపు చేయాలన్నారు. గెజిట్, రికార్డుల ప్రకారం సర్వే చేపట్టి, ఖిల్లా ప్రాంత రక్షణకు చర్యలు చేయాలన్నారు. అనంతరం ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమావేశమై చేపట్టాల్సిన చర్యల గురించి సమీక్షించారు. చారిత్రక ఆనవాళ్లకు ఎలాంటి విఘాతం కలగకుండా మునిసిపల్, పురావస్తు, పర్యాటక శాఖలు సమన్వయం తో ఖిల్లా ను ఆహ్లాదకరమైన మంచి పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలన్నారు. కలెక్టర్ తనిఖీ సందర్భంగా ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణా సహాయ కలెక్టర్ రాధిక గుప్తా, పురావస్తు శాఖ సహాయ సంచాలకులు నర్సింగ్ నాయక్, మంగు నాయక్, జిల్లా పర్యాటక అధికారి సుమన్ చక్రవర్తి, మునిసిపల్ ఇఇ కృష్ణాలాల్, డిఇ నవ్యజ్యోతి, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ శైలజ, రెయిన్ వాటర్ ప్రాజెక్టు ఆర్గనైజేషన్ ఫౌండర్ కల్పన రమేష్, అధికారులు తదితరులు ఉన్నారు.