బాల్య వివాహాలు అరికట్టాలి.యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక డిమాండ్.
సాక్షిత నంద్యాల : బాల్య వివాహాలను అరికట్టాలి అని యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లాలోని నంద్యాల, బేతంచర్ల,కోవెలకుంట్ల, బనగానపల్లె,నందవరం, ఆళ్ళగడ్డ తదితర గ్రామాలలో బాల్య వివాహలు జరుగు తున్నట్లు మహిళా ఐక్య వేదిక దృష్టికి రావడం జరిగిందని,ఈ విషయంపై పట్నం రాజేశ్వరి నంద్యాల జిల్లా కలెక్టర్ ని కలిసి పూసల, బేడ బుడగ జంగం కులాల్లో జరుగుతున్న బాల్య వివాహాలను అరికట్టి ఆ యా గ్రామాలలో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేలా సదస్సులు నిర్వహించి బాల్యవివాహాలను అరికట్టే దిశగా అధికారులు చొరవ తీసుకోవాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్బంగా పట్నం రాజేశ్వరి మాట్లాడుతూ పూసల బేడ బుడగ జంగం తదితర కులాల్లో అధికారుల కళ్ళు గప్పి యధేచ్చగా బాల్యవివాహాలు జరుపుతున్నారని ఆమె అన్నారు. కొన్ని సందర్భాల్లో అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆమె అన్నారు. బాల్యవివాహాలు జరిపించే తల్లిదండ్రులు మరియు కులపెద్దలు రాజకీయ పలుకుబడితో చట్టాన్ని ఉల్లంఘిస్తూ బాల్యవివాహాలు జరిపిస్తూ ఆడపిల్లలను చదువుకు దూరం చేసి పసి వయసులోనే వాళ్ళ జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి బాల్యవివాహాలను ప్రోత్సహిస్తూ, అమాయక బాలికల జీవితాలతో ఆటలాడుతున్నటు వంటి కులపెద్దలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. కలెక్టరు ని కలిసి వినతిపత్రం ఇచ్చిన వారిలో రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి, మాల్య దేవిబాయి, కటికె భాను, ముడియం సునీత, ఆకుతోట పద్మావతి, పెద్దక్క తదితరులు పాల్గొన్నారు.