YCP MP Vijayasai Reddy’s sensational announcement to resign if Visakha railway zone does not come
సాక్షిత : విశాఖ రైల్వే జోన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెప్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఏపీ పునర్విభజన చట్టంలో రైల్వే జోన్ గురించి స్పష్టంగా చెప్పారని అన్నారు.నిన్న కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో రైల్వే జోన్ అంశమే చర్చకు రాలేదని తెలిపారు. సీఎం జగన్ ప్రభుత్వంపై అక్కసుతోనే తప్పుడు రాతలు రాస్తున్నారని ఆరోపించారు. తప్పుడు రాతలపై రామోజీరావు, రాధాకృష్ణ సమాధానం చెప్తారా? అని ప్రశ్నించారు.
రైల్వే జోన్‌పై అవాస్తవాలను ప్రచురించి వారి స్థాయిని దిగజార్చుకోవద్దని అన్నారు. విశాఖకు రైల్వే జోన్ వచ్చి తీరుతుందని విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖకు రైల్వే జోన్ రాకుంటే రాజీనామా చేస్తానని తెలిపారు.
ఇక, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014కి సంబంధించిన అపరిష్కృత సమస్యలపై చర్చించేందుకు కేంద్ర హోం శాఖ మంగళవారం (సెప్టెంబర్ 27) రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సీనియర్ అధికారులతో కీలక సమావేశం నిర్వహించింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ అధికారులు, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మతో పాటు ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉభయ రాష్ట్రాల మధ్య వివాదాలపైనా ఈ సమావేశంలో చర్చ సాగింది. 14 అంశాలను ఈ సమావేశం ఎజెండాలో చేర్చారు. ఏడు అంశాలు రెండు రాష్ట్రాలకు చెందినవి. మరో ఏడు అంశాలు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి.