Yadavs and Kurmas developed economically, socially and politically
యాదవులు, కుర్మలు ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి సాధించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసం వద్ద ఈ నెల 26 వ తేదీన మన్నెగూడా లోని BMR సార్ధ కన్వెన్షన్ లో జరిగే యాదవ కుర్మల ఆత్మీయ సమ్మేళనం బ్రోచర్ లను ఆవిష్కరించారు. అనంతరం యాదవ సంఘం ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడుతూ జనాభా పరంగా యాదవ కుర్మలు పెద్ద సంఖ్యలో ఉన్నారని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కు ముందు యాదవ, కుర్మల ను కేవలం ఓటు బ్యాంకు లాగానే చూశారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు యాదవులకు రాజకీయంగా పెద్ద పీట వేశారని తెలిపారు. అదేవిధంగా ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే ఆలోచన తో దేశంలో ఎక్కడా లేని విధంగా 11 వేల కోట్ల రూపాయల వ్యయంతో సబ్సిడీపై గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
ఇవే కాకుండా వెనుకబడిన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిందని వివరించారు. యాదవ కుర్మల అభివృద్ధి కి అన్ని విధాలుగా కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. గొర్రెల యూనిట్ ల లబ్ధిదారుల ఖాతాల్లోకి పైలెట్ ప్రాజెక్ట్ గా నగదు బదిలీ ని చేపడితే BJP నేతలు ఎన్నికల కమిషన్ కు పిర్యాదు చేసి నిలిపి వేయించారని ఆరోపించారు.
దీంతో యాదవ, కుర్మల వ్యతిరేకి BJP అని రుజువైందని చెప్పారు. మునుగోడ్ ఉప ఎన్నికల్లో BJP కి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. యాదవులు, కుర్మల ఐక్యతను చాటి చెప్పేందుకు నిర్వహించే ఆత్మీయ సమ్మేళనం లో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
రానున్న రోజుల్లో రాజకీయంగా మరింత ప్రాధాన్యత పెరగనున్నదని తెలిపారు. ఈ సమావేశంలో గొర్రెలు, మేకల అభివృద్ధి ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, కార్పొరేటర్ రసాల వెంకటేష్, యాదవ సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ యాదవ్, నల్లగొండ జిల్లా DCMS చైర్మన్ వట్టెపు జానయ్య, నాయకులు పెద్ద బోయిన శ్రీనివాస్, సోమన బోయిన సుధాకర్, కడారి అంజయ్య, ఐలేష్ యాదవ్, రాజారాం, శ్రీహరి, గోసుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.