నాడు బిందెలతో మహిళల కుస్తీలు…
దినదినగండంగా గడిపిన ప్రజలు…
నేడు మిషన్ భగీరథతో తొలగిన క‘న్నీటి’ గోస…
ఇంటింటికీ నల్లా కనెక్షన్లు…
అపర భగీరథుడు సీఎం కేసీఆర్…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రూ.759.35 కోట్లతో ఇంటింటికీ సురక్షిత త్రాగునీరు…
” తెలంగాణ మంచినీళ్ళ పండుగ “లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ” తెలంగాణ మంచినీళ్ళ పండుగ ” వేడుకలు ఘనంగా జరిగాయి. మొదటగా గాజులరామారం దేవేందర్ నగర్ మంచినీటి రిజర్వాయర్ నుండి ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం షాపూర్ నగర్ పోచమ్మ ఆలయంలో మహిళలు బోనాలతో ప్రత్యేక పూజలు చేసి ఎంజే గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్, వాటర్ పోల్యూషన్ డిటెక్టివ్ ఎక్విప్మెంట్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గడిచిన తొమ్మిదేళ్లలో మంచినీటి రంగంలో సాధించిన విజయాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఏవీని వీక్షించారు.
గతంలో తీవ్ర మంచినీటి సమస్యలను ఎదుర్కొన్న వినియోగదారులు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా నీటి సౌకర్యం కల్పించారో చెబుతూ సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు. త్రాగునీరు ఏ విధంగా ఉందో స్వతహాగా పరీక్ష చేసుకునేందుకు వీలుగా రూపొందించిన క్వాలిటీ కిట్ లు 20 మంది వినియోగదారులకు పంపిణీ చేశారు. ప్రజలకు త్రాగునీరు అందించడంలో ఉత్తమ సేవలు అందిస్తున్న అధికారులను, సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటూ రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తూ, దశాబ్దాల కొద్ది అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన అపర భగీరథుడు గౌరవ సీఎం కేసీఆర్ గారని అన్నారు.
సమస్త జీవకోటికి ప్రాణాధారం నీరు అని అటువంటి నీరు లేకుంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో గత పాలకుల హయాంలో కళ్ళారా చూశామన్నారు. కానీ సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇంటింటికీ సురక్షిత త్రాగునీరు అందించి త్రాగు నీటి సమస్యే లేకుండా చేశారని అన్నారు. ఆనాడు బిందెడు నీళ్ళ కోసం యుద్ధాలు చేయాల్సిన దుస్తితి నుండి ఇంటింటికీ నల్లా కనెక్షన్లు అందించి గోదావరి జలాలను అందిస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్ గారని అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గత పాలకుల హయాంలో తీవ్రమైన మంచినీటి కష్టాలు ఉండేవని, ఆఫీసుల చుట్టూ ఖాళీ బిందెలతో మహిలమ్మలు ధర్నాలు, రాస్తా రోకోలు నిర్వహించిన సందర్బాలు అనేకం ఉన్నాయన్నారు. కానీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో గడిచిన తొమ్మిదేళ్లలో రూ.759.35 కోట్లతో గడప గడపకు సురక్షిత మంచీనీరు ప్రతీ రోజు నిర్విఘ్నంగా అందిస్తున్నామని అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీహెచ్ఎంసీ పరిధిలో 5 ఎస్టీపీలతో కలిపి రూ.530.18 కోట్లు, నిజాంపేట్ రూ.17.55 కోట్లు, ప్రగతి నగర్ 14.46 కోట్లు, బాచుపల్లి రూ.48.15 కోట్లు, గండిమైసమ్మ రూ.93.46 కోట్లు, కొంపల్లి రూ.55.55 కోట్లు మొత్తంగా రూ.759.35 కోట్లు మంచినీటి సౌకర్యంకు ఖర్చు చేశామని చెప్పారు.
నాడు మొత్తం ఖర్చు రూ.58.98 కోట్లు మాత్రమే అయితే, నేడు 2014 నుండి ఇప్పటి వరకు రూ.759.35 కోట్లు ఖర్చు చేశామన్నారు. అంటే దాదాపు రూ.700.37 కోట్లు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నీటి సరఫరా, మురుగునీటి శుద్ధికరణకు వెచ్చించామని చెప్పారు. అంతే కాకుండా కొత్తగా ఏర్పాటైన కాలనీల్లో సైతం మెరుగైన మంచినీటి సౌకర్యం కల్పించేలా కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, నిజాంపేట్ మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి, వాటర్ వర్క్స్ డైరెక్టర్ ఆపరేషన్ స్వామి, జీఎంలు శ్రీధర్ రెడ్డి, సంతోష్ కుమార్, డీజీఎంలు, మేనేజర్లు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు, డివిజన్ల అధ్యక్షులు, నాయకులు, మహిళా నాయకురాలు, వినియోగదారులు పాల్గొన్నారు.
—