SAKSHITHA NEWS


What is KCR’s stance on the Polavaram project?: Bandi Sanjay

పోలవరం ప్రాజెక్టు పై కేసీఆర్ వైఖరి ఏమిటి?: బండి సంజయ్

హైదరాబాద్‌: ఇక్కడ ఉన్న ఆంధ్ర ఓటర్లను నమ్మించి ఓట్లు వేయించుకోవడం సీఎం కేసీఆర్‌కు తెలిసిన విద్య అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఓట్లు అయిపోయాక నీళ్ల వాటా పేరుతో ఏపీ, తెలంగాణ అని మళ్లీ రెచ్చగొడతారని విమర్శించారు. గతంలో ఏపీ వాళ్లను కేసీఆర్‌ అవమానించలేదా?అని ప్రశ్నించారు.

‘‘ఒక పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఉంటే ఆయన రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటిస్తారు. కానీ, భారాసకు ఇప్పటి వరకు జాతీయ అధ్యక్షుడే లేడు. జాతీయ అధ్యక్షుడు లేకుండానే రాష్ట్ర అధ్యక్షుడిని ఎలా ప్రకటిస్తారో నాకు అర్థం కాలేదు. సొంత రాష్ట్రంలోనే పార్టీ అధ్యక్షుడిని ప్రకటించలేదు.. కానీ, పక్క రాష్ట్రానికి అధ్యక్షుడిని ప్రకటించారు.

భారాస పార్టీ పరిస్థితి ఏంటో ప్రజలకు అర్థమవుతోంది. రైతులకు ఉచిత విద్యుత్‌ గురించి కేసీఆర్‌ మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నారా? విశాఖ ఉక్కు గురించి మాట్లాడుతున్నారు.. తెలంగాణలో నిజాం చక్కెర పరిశ్రమను ఎందుకు పునరుద్ధరించటం లేదు.

రాష్ట్రంలో విద్యుత్‌ఛార్జీలు పెంచింది నిజం కాదా? కేసీఆర్‌ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నీట మునిగింది నిజం కాదా? ఏపీ సీఎంతో కుమ్మక్కై కేఆర్‌ఎంబీ సమావేశానికి కేసీఆర్‌ వెళ్లట్లేదు. పోలవరం ప్రాజెక్టుపై మీ వైఖరి ఏమిటి? పోలవరం ఎత్తు పెంచాలో, తగ్గించాలో కేసీఆర్‌ చెప్పాలి. తెలంగాణ ఏర్పడక ముందు 18లక్షల వ్యవసాయ బోర్లు ఉంటే..రాష్ట్రం ఏర్పడిన తర్వాత 23 లక్షల బోర్లు ఉన్నాయి.

పాఠశాల విద్యలో తెలంగాణ 21వ స్థానంలో ఉంది. నిరుద్యోగంలో తెలంగాణ 4వ స్థానంలో ఉంది. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ 5వ స్థానంలో ఉంది. యువతను భాజపాకు దూరం చేసేందుకే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నారు’’ అని బండి సంజయ్‌ ఆరోపించారు.


SAKSHITHA NEWS