SAKSHITHA NEWS

We will record the statement of MLC Kavitha on 11th of this month: CBI

ఈ నెల 11న ఎమ్మెల్సీ కవిత వాంగ్మూలం నమోదు చేస్తాం:సీబీఐ

హైదరాబాద్‌: దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఎమ్మెల్సీ కవిత మెయిల్‌కు సీబీఐ అధికారులు రిప్లై ఇచ్చారు. ఈనెల 11న విచారణ జరిపేందుకు సీబీఐ అంగీకరించింది. ఈనెల 11న ఉదయం 11గంటలకు వాంగ్మూలం నమోదు చేస్తామని సీబీఐ అధికారులు రిప్లై ఇచ్చారు.

మద్యం కేసులో ఈనెల 6న విచారణకు రావాలని సీబీఐ కవితకు లేఖ రాసిన విషయం విదితమే. అయితే కేంద్ర హోంశాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ కాపీని తనకు అందించాలని కోరుతూ కవిత సీబీఐకి లేఖ రాశారు. దానికి స్పందించిన అధికారులు ఈ-మెయిల్‌ ద్వారా సమాధానం ఇస్తూ ఎఫ్‌ఐఆర్‌ కాపీ వెబ్‌సైట్‌లో ఉందని తెలిపారు. దీనిపై న్యాయనిపుణులతో చర్చించిన అనంతరం సీబీఐ అధికారి రాఘవేంద్ర వత్సకు కవిత లేఖ రాశారు.

‘‘ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న నిందితుల పేర్లు సహా అన్ని అంశాలను క్షుణ్నంగా పరిశీలించాను. అందులో నా పేరు ఎక్కడా లేదు. ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల ఈ నెల 6వ తేదీన నేను సీబీఐ అధికారులను కలుసుకోలేను. ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో మీకు అనువైన ఏదైనా ఒక రోజు హైదరాబాద్‌లోని మా నివాసంలో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటాను.

దర్యాప్తునకు సహకరించడానికి పైన పేర్కొన్న తేదీల్లో ఒక రోజు సమావేశమవుతాను. త్వరగా తేదీని ఖరారు చేయాలని కోరుతున్నాను. నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని. దర్యాప్తునకు సహకరిస్తాను’’ అని కవిత సీబీఐ డీఐజీ రాఘవేంద్ర వత్సకు సోమవారం మెయిల్‌ ద్వారా లేఖ పంపారు. కవిత పంపిన మెయిల్‌కు ఈమేరకు సీబీఐ అధికారులు రిప్లై ఇచ్చారు.


SAKSHITHA NEWS