SAKSHITHA NEWS

మహిళా బిల్లు తెచ్చేదాకా విశ్రమించం

మహిళా బిల్లు తెచ్చేదాకా ఉద్యమాన్ని ఆపబోమని భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు.
మాట తప్పిన మోదీని నిలదీస్తాం

రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెస్తాం
చట్టసభల్లో ప్రాతినిధ్యంతోనే మార్పు
రష్యన్‌ మీడియా సంస్థ స్పుత్నిక్‌ ఇంటర్వ్యూలో ఎమ్మెల్సీ కవిత

మహిళా బిల్లు తెచ్చేదాకా ఉద్యమాన్ని ఆపబోమని భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు. 75 ఏండ్ల స్వాతంత్య్ర భారత దేశంలో చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు దక్కకపోవటం దురదృష్టకమని పేర్కొన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో మహిళా రిజర్వేషన్‌ బిల్లు తెస్తామన్న మోదీ.. అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్నే పట్టించుకోవటం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన తరువాత గణనీయమైన మార్పులు వచ్చాయని.. అదే స్ఫూర్తితో చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆమె డిమాండ్‌ చేశారు. మహిళా బిల్లుకు దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగడతామని తెలిపారు. రష్యన్‌ మీడియా సంస్థ స్పుత్నిక్‌కు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. దేశ సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చ జరుగుతున్న ఆ ఇంటర్వ్యూ వివరాలిలా ఉన్నాయి.

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు 2010లో రాజ్యసభ ఆమోదం తెలిపింది. 2014తో దాని కాలపరిమితి ముగిసింది. ఆ తర్వాత బిల్లు పార్లమెంట్‌ ముందుకు ఎందుకు రాలేదని మీరు భావిస్తున్నారు?

మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టడానికి రాజకీయ సంకల్పం కావాలి. 2014లో బీజేపీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో మహిళా బిల్లును తెస్తామని వాగ్దానం చేసింది. ప్రతిపక్షాలు ఎంత ఒత్తిడి తెచ్చినా బీజేపీ ఇప్పటివరకు దాని ఊసే ఎత్తడం లేదు. దేవెగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు 1996లో బిల్లు పెట్టారు. అప్పటి నుంచి 2014 దాకా ఎన్ని ప్రయత్నాలు చేసి నా ఫలితం లేదు. మ్యానిఫెస్టోలో పెట్టడం మినహా.. అధికారంలోకి వచ్చినతర్వాత ఇప్పటివరకు మహిళా బిల్లుపై మోదీ ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం దురదృష్టకరం. పార్లమెంట్‌ ఉభయ సభల్లో మా పార్టీ ఎంపీలు బిల్లు కోసం ఒత్తిడి తెస్తూనే ఉన్నారు.

రాజకీయ ఏకాభిప్రాయం రాకపోవడం వల్లే మహిళా బిల్లుపై స్పష్టత లేదు కదా?

మహిళా రిజర్వేషన్‌ బిల్లు విషయంలో రాజకీయ పార్టీలకు ఏకాభిప్రాయం లేదు. అనేక పార్టీలు మహిళా రిజర్వేషన్‌ కోసం పట్టుబడుతుంటే.. బిల్లు ఆమోదం పొందితే ఇప్పుడున్న స్థానాల్లో మహిళలకు కొన్ని సీట్లు పోతాయనే భయం కొన్ని పార్టీల్లో ఉన్నది. దీన్ని నివారించేందుకు బీఆర్‌ఎస్‌ కొన్ని సూచనలు చేసింది. కోటాలో కోటా (కోటా విత్‌ ఇన్‌ ది కోటా) అని కొన్ని పార్టీలు సూచిస్తున్నాయి. రాజకీయ ఏకాభిప్రాయాన్ని సాధించాలంటే.. ముందుగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఆ మేరకు చొరవ తీసుకుని ప్రయత్నించాలి. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ప్రజల స్థితిగతులు తెలుసుకోవటానికి దాదాపు నాలుగున్నర లక్షల మంది ఉద్యోగులు, సిబ్బందితో 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేశాం. అప్పుడే ఏర్పడిన రాష్ర్టానికి ఇది సాధ్యమైనప్పుడు.. కేంద్రానికి ఎందుకు సాధ్యంకాదు. కనీసం బీసీ కులగణనకూ కేంద్రం వెనుకడుగు వేస్తున్నది. మోదీ మనసుపెడితే మహిళా బిల్లు ఈ పార్లమెంట్‌ సెషన్‌లోనే ఆమోదం పొందుతుంది.

భారత పార్లమెంట్‌లో మహిళా భాగస్వామ్యం క్రమంగా పెరుగుతున్నది కదా?

బిల్లు లేకుండా పార్లమెంట్‌లో మహిళా ప్రాతినిధ్యం పెరగదనే 75 ఏండ్ల చరిత్ర చెబుతున్నది. 1952లో 22 మంది ఎంపీలు ఉంటే ఇప్పుడు 78 మంది ఉన్నారు. అంటే అప్పటికీ ఇప్పటికీ కేవలం 50 సీట్లను మాత్రమే పెరిగాయి. మరో 75 ఏండ్లు వేచిచూస్తే మహా అయితే ఇంకో 50 సీట్లు పెరుగుతాయి . అప్పటికీ కోటాను సాధించుకోలేము. అందుకే బిల్లు కావాలని డిమాండ్‌ చేస్తున్నాం. దేశంలో ఇప్పటివరకు మహిళలు ద్వితీయశ్రేణి పౌరులుగానే పరిగణించబడుతున్నారు. జనాభాలో సగం ఉన్న మేము ఇప్పటికిప్పుడు సగం సీట్లు కావాలని కోరటంలేదు. కనీసం మూడోవంతు ఇవ్వాలని కోరుతున్నాం. మా డిమాండ్‌లో న్యాయం ఉందని అందరికీ తెలుసు.

స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలవుతున్నా పురుషులే ఆధిపత్యం వహిస్తున్నారనే విమర్శలున్నాయి. దీనికి కారణం ఏమిటి? మహిళలు రాజకీయాల్లోకి రావడం లేదా? రాకుండా వారిని అడ్డుకుంటున్నారా?

స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన తర్వాత స్థానిక సంస్థల పాలనలో అద్భుతమైన మార్పులు వచ్చాయి. 29 రాష్ట్రాలు ఉంటే.. 21 రాష్ట్రాల్లో స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అందుతున్నాయి. 20 ఏండ్లలో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరిగింది. గతంలో ఒక మహిళ సర్పంచుగా ఉంటే.. ఆమె భర్త నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. మహిళలు రాజకీయాల్లోనూ రాణించగలరని స్థానిక సంస్థల కోటా నిరూపించింది. ఉదాహరణకు గూగుల్‌ సంస్థలో ఉద్యోగానికి రాజీనామా చేసి ఓ యువతి హైదరాబాద్‌లో కార్పొరేటర్‌గా గెలిచారు. ఇన్ఫోసిస్‌కు రాజీనామా చేసిన యువతి ఓ జిల్లాపరిషత్‌ చైర్‌పర్సన్‌ అయ్యారు. మార్పు అనేది రాత్రికి రాత్రే జరగదు. రేపు పార్లమెంట్‌లో మహిళా బిల్లు పెట్టినా ఒకేసారి మార్పు వస్తుందని మేమూ అనుకోవటం లేదు.

భారతదేశం పురుషాధిక్య సమాజం. మహిళలు ఇప్పటికీ అణచివేతకు, వివక్షకు గురవుతున్నారు. రిజర్వేషన్లు కావాలని డిమాండ్‌ చేసే బదులు మీరు మహిళా సాధికారత కోసం కృషి చేయవచ్చు కదా అనే వాదనకు మీ సమాధానం?

ఈ వాదనలో నిజం లేదు. మహిళలపై వివక్ష, అణచివేత కేవలం భారత్‌కే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉన్నది. అయితే సమాజంలో అనేక మార్పులు వస్తున్నాయి. విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. స్థానిక సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగిన తరువాత మహిళలపై అణచివేత, వివక్ష క్రమంగా దూరమవుతున్నాయి. మహిళలకు రక్షణ పెరిగింది. బాధితులకు భరోసా దక్కుతున్నది. అదే క్రమంలో మహిళా సాధికారత కోసం అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగితే సమాజం రూపురేఖలు మారిపోతాయి. ఆ నియోజకవర్గంలో రెండు లక్షల ఓటర్లు ఉంటే అందులో లక్ష మంది మహిళా ఓటర్లు ఉంటారు. ఎమ్మెల్యే మహిళ అయితే.. ఆ లక్షమందిలో ఆత్మైస్థెర్యం పెరుగుతుంది. పార్లమెంట్‌లో మహిళా బిల్లుకు ఆమోదం లభిస్తే.. లోక్‌సభలో 180 మంది మహిళా ఎంపీలుంటారు. దీంతో మహిళారంగంలో దేశ ముఖచిత్రమే మారిపోతుంది.

ప్రస్తుతం పార్లమెంట్‌ సమావేశాల్లో మీ పార్టీకి ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తారా?

మహిళా రిజర్వేషన్ల కోసం 2014లో తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి పార్లమెంట్‌కు పంపింది. అప్పటినుంచి సందర్భం వచ్చిన ప్రతీసారి మా పార్టీ కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నది. అయితే ఈ పార్లమెంట్‌ సమావేశంలో అదానీ వ్యవహారంలో హిండెన్‌బర్గ్‌ నివేదికపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ వేయాలని ప్రతిపక్ష పార్టీలతో కలిసి బీఆర్‌ఎస్‌ ఉద్యమిస్తున్నది. పార్లమెంట్‌ లోపలా బయటా మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం పార్టీ పోరాటం కొనసాగిస్తున్నది. మేం చేపట్టిన దీక్షలో, రౌండ్‌టేబుల్‌ సదస్సుల్లో బీఆర్‌ఎస్‌ భాగస్వామ్యం ఉన్నది. రాజకీయ పార్టీలను ఏకం చేయటానికి మా వంతు ప్రయత్నం మేం చేస్తూనే ఉన్నాం. ఎంపీలు ఎవరికి వారుగా కానీ, పార్టీ పరంగా కానీ సెషన్స్‌ జరిగేప్పుడు జీరో అవర్‌లో లేవనెత్తవచ్చు, ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టవచ్చు అనే అంశంపైనా వివరిస్తున్నాం. ఒకవైపు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే. మరోవైపు అన్ని పార్టీలపై ఒత్తిడి తెచ్చే కార్యాచరణను రూపొందించుకున్నాం.

మహిళలకు చట్టబద్ధ రాజకీయ అవకాశం దక్కితే దేశ రాజకీయ వాతావరణం మారుతుందని భావిస్తున్నారా?

కచ్చితంగా మారుతుంది. సాధారణ స్త్రీకి, రాజకీయ అధికారంలో ఉన్న స్త్రీకి మధ్య ఎంతో తేడా ఉంటుంది. సాధారణ స్త్రీ తన కోసం, కుటుంబం కోసం మాత్రమే ఆలోచిస్తుంది. అదే రాజకీయ రంగంలో ఉన్న స్త్రీ ఆ రెండు బాధ్యతలు నెరవేరుస్తూనే.. సమాజ పురోగమనంలో భాగస్వామి అవుతుంది. చట్టాలు చేసే అవకాశం మహిళలకు దక్కితే తమ స్వీయానుభవంలో నుంచి, సహనంతో సమస్యకు పరిష్కారాలు కనుగొనే ప్రయత్నం చేస్తారు. నా 17 ఏండ్ల ప్రజాజీవితంలో మహిళా స్వాభిమాన దృక్కోణంలోంచి అనేక అంశాలకు ఆచరణీయమైన కార్యాచరణ చేయగలిగాను. ఆ ధైర్యం, నమ్మకంతోనే ఇప్పుడు మహిళా బిల్లు సాధన కోసం పోరాటం చేస్తున్నాం. చట్టమే మహిళకు ఎన్నటికైనా చుట్టంగా నిలబడుతుంది. అందుకోసమే మా ప్రయత్నం.


SAKSHITHA NEWS