ఇందుకోసం మరో 200 ఎకరాలు కేటాయించడానికి సిఎం అంగీకరించారు
- సిఎం 18న శ్రీనివాస సేతు ప్రారంభించి, ఉద్యోగులకు ఇంటి స్థలాలు పంపిణీ చేసి గంగమ్మ ఆలయాన్ని సందర్శిస్తారు
…టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి
తిరుపతి నగరం
టీటీడీ ఉద్యోగులతో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఇంటి స్థలాలు ఇస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రకటించారు. ఈ విషయంలో ఏ ఒక్కరినీ అసంతృప్తికి గురి చేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. టీటీడీ ఉద్యోగులకు ఇంటిస్థలాల పంపిణీ కోసం ఏర్పాటు చేస్తున్న వేదిక, ప్రారంభించనున్న శ్రీనివాస సేతు, శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో జరుగుతున్న పనులను మధ్యాహ్నం టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్, ఎం.ఎల్.సి సిపాయి సుబ్రమణ్యం, టీటీడీ జెయిఓ సదాభార్గవి, ఇతర అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబరు 18వ తేదీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు.
అంతకు ముందు తిరుపతి నగరం సిగలో మరో మణిహారం కాబోతున్న శ్రీనివాససేతును ప్రారంభిస్తారని తెలిపారు. సుమారు రూ 650 కోట్లతో నిర్మించిన ఈ వంతెనపై 19వ తేదీ నుండి వాహనాల రాకపోకలు అనుమతిస్తారని అన్నారు. యాత్రీకులు, స్థానికులకు కూడా శ్రీనివాస సేతు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అనంతరం టీటీడీ ఉద్యోగులకు కొందరికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇంటి స్థలాలు పంపిణీ చేస్తారని చెప్పారు. రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఇంటిస్థలాలు ఇవ్వడం కోసం మరో 200 ఎకరాలు కావాలని తాను ముఖ్యమంత్రిని కోరానన్నారు. 200 ఎకరాల భూమి సమీకరణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను ముఖ్యమంత్రి ఆదేశించారని చైర్మన్ కరుణాకరరెడ్డి వివరించారు. ఈ కార్యక్రమాలు ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లిని దర్శించుకుంటారని తెలిపారు. సుమారు 400 సంవత్సరాల క్రితం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు మొదట శ్రీ తాతయ్య గుంట గంగమ్మను దర్శించే వారని అన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత సంవత్సరం నుంచి ఈ సంప్రదాయాన్ని పునరుద్ధరించడం పట్ల తిరుపతి వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం కూడా ముఖ్యమంత్రి శ్రీ తాతయ్య గుంట గంగమ్మను దర్శించుకున్నాకే శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళతారని చెప్పారు. తమది అభివృద్ధి, ఆధ్యాత్మిక, ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వమని భూమన కరుణాకరరెడ్డి పునరుధ్ఘాటించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, మునిసిపల్ కార్పొరేషన్ ఎస్ఈ మోహన్, ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, ఎంఈ చంద్రశేఖర్, ఆఫ్కాన్ సంస్థ రంగస్వామి, ఏయికామ్ భాలాజీ ఇతర అధికారులు పాల్గొన్నారు.