గుంటూరు జిల్లా
మంగళగిరి
అఘోరీ దాడి ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కి బాధితుడు ఫిర్యాదు
గత నెల 18వ తేదీన మంగళగిరి ఆటోనగర్ ఆల్ఫా హోటల్ ఎదుట ఓ కార్ వాష్ సెంటర్ వద్ద అఘోరీ జరిపిన దాడిలో గాయపడిన ఆరేపల్లి రాజు అనే మీడియా ప్రతినిధి జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సి) కి ఫిర్యాదు చేశారు. మంగళగిరికి చెందిన ఓ ప్రజాప్రతినిధి పదవీ ప్రమాణ స్వీకారం సందర్భంగా వార్త కవరేజ్ కి విలేకరులు వెళ్ళగా అదే ప్రాంతంలో కార్ వాష్ సెంటర్ వద్ద మారణాయుధాలతో నగ్నంగా తిరుగుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్న సందర్భంలో పలువురు విలేకరులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అదే సమయంలో అఘోరీ తన కారులో ఉన్న ఇనుప రాడ్డును తీసుకొని విలేకరితోపాటు కార్ వాష్ సెంటర్లో ఉన్న యువకులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడింది.
ఈ ఘటనలో విలేఖరి కాలు విరిగి తీవ్ర గాయాలపాలవగా స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు. కాగా సదరు ఘటనలో పోలీసులు అఘోరిపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించారని తెలిపారు. తనపై దాడికి పాల్పడిన అఘోరీపై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సి) కు బాధితుడు ఫిర్యాదు చేశారు