SAKSHITHA NEWS

తెలంగాణలో బీసీ కులగణనపై వీహెచ్ కీలక కామెంట్లు..

హైదరాబాద్: తెలంగాణలో అక్టోబర్ 28 నుంచి నవంబర్ 13 వరకూ బీసీ కులగణన చేపట్టనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తెలిపారు. ఈనెల 28నుంచి అధికారుల ఇళ్లకు వస్తారని, వారు అడిగిన సమాచారం ఇవ్వాలని ఆయన ప్రజలను సూచించారు. కులగణన జరగాలని చెప్పిన ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ అని, గణన జరిగితే వెనకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆయన ఎప్పుడో చెప్పాలని మాజీ ఎంపీ అన్నారు. రైతులు, విద్యార్థులు ఇలా అందరి సమస్యలు తెలిసిన నాయకుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు.

ఈ సందర్భంగా మాజీ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ.. ” కులగణన చేసేందుకు గ్రామాలకు, మండలాలకు అధికారులు వస్తారు. ప్రజలు వివరాలు ఇచ్చి సహకరించాలి. బీసీ కులగణన జరిగితే వారి జనాభా ఎంతో తెలుస్తుంది. ఎస్సీ, ఎస్టీలు అందరూ వారి జనాభా తెలియాలని అడుగుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కులగణన తెలంగాణలో మొదలుపెట్టారు. గతంలో మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చారు. బీసీల పిల్లలు ఐఐటీ, ఐఐఎంలో చదువుతున్నారు. అందరూ కులగణనను వినియోగించుకోవాలి. వివరాలు ఇవ్వడం ద్వారా పంచాయతీ, మేయర్ ఎన్నికల్లో అందరికీ అవకాశం ఉంటుంది. ప్రధాని మోదీ పదేళ్ల నుంచి అధికారంలో ఉన్నారు. కానీ ఆయన ఇంతవరకూ కులగణన చేయలేదు. గణన జరిగితే బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ వస్తుంది” అని చెప్పారు.


మరోవైపు బీసీ కులగుణనపై తెలంగాణ హైకోర్టు సెప్టెంబరు 10న కీలక ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లో కులగణన పూర్తి చేసి నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. బీసీ కులగణనపై బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో సెప్టెంబర్ 10న వాదోపవాదాలు జరిగాయి. ఈ మేరకు హైకోర్టు తీర్పు వెలువరించింది. అయితే కులగణన తర్వాతే కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈనెల 28 నుంచి కులగణన ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టింది..


SAKSHITHA NEWS