తెలంగాణలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. అంగన్వాడీ సెంటర్లలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టుల నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోన్నట్లు తెలుస్తోంది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించే అంగన్వాడీ సెంటర్లలో టీచర్లు, ఆయాల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే జిల్లాల వారీగా ఉద్యోగ ప్రకటనలు విడుదల అయ్యే అవకాశం ఉంది. అంగన్వాడీలోని టీచర్లు, ఆయాల పోస్టులకు ఏడు, పదో తరగతి ఉత్తీర్ణులైన మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఈ పోస్టులకు విద్యార్హత మార్కులు, స్థానికత, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.
రాష్ట్రంలో మొత్తం 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఒక్కో కేంద్రంలో టీచర్‌తోపాటు, ఒక హెల్పర్ కూడా ఉంటారు. ఇప్పటికే పనిచేస్తున్నవారికి పదోన్నతులు రావడం, చాలామంది రిటైర్మెంట్ అయిపోవడం వంటి వాటితో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటి భర్తీకి కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఖాళీల్లో 50 శాతం హెల్పర్లకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుంది. సూపర్వైజర్ పోస్టుల్లోనూ 50 శాతం పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి.
ఇక,అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 14 వేల పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు ఇప్పటికే తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క ప్రకటించారు. రాష్ట్రంలో 4 వేల మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేసి అంగన్వాడీ కేంద్రాలుగా మార్చినట్లు ఆమె తెలిపారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులను కేవలం మహిళలకే ఇవ్వనున్నారు. పెళ్లి అయిన మహిళలు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు. ఈ మేరకు జిల్లాల వారీగా ఖాళీల వివరాలతో కూడిన ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులు ఇప్పటికే శిశు సంక్షేమశాఖ జిల్లా సంక్షేమాధికారులను ఆదేశించడం జరిగింది. ఇక, ప్రభుత్వం నుంచి వచ్చే సూచనలకు అనుగుణంగా అధికారులు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.