టీటీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించండి – ఈఓ కు సీఐటీయూ నేతల వినతి *
………
సాక్షిత, తిరుపతి బ్యూరో:* 644 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న టిటిడి అటవీ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం టీటీడీ ఈఓ ధర్మారెడ్డికి సిఐటియు టీటీడీ అటవీ కార్మికుల యూనియన్ నేతలు వినతిపత్రం సమర్పించారు. సిఐటియు నగర అధ్యక్షులు టి. సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో టీటీడీ అటవీ కార్మికులు ధర్మారెడ్డికి సమస్యలను వివరించారు. 30 ఏళ్లుగా పనిచేస్తున్న అటవీ కార్మికులకు టీటీడీ బోర్డు టైం స్కేల్ ఇవ్వాలని తీర్మానించిందని, రాష్ట్ర హైకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆదేశించిందని తెలిపారు. పై రెండు అమలు చేయకపోగా టైం స్కేల్ పరిధిలో ఉన్న తమను లక్ష్మీ శ్రీనివాస కార్పొరేషన్ కు బలవంతంగా బదలాయించటం సమంజసం కాదని వారు ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. టైం స్కేల్ అమలుపరుస్తూ డిఏ, హెచ్ఆర్ ఏ తో కూడిన అలవెన్సులను అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్మికుల పట్ల టీటీడీ యాజమాన్యం వివక్షను ప్రదర్శించకుండా సమన్యాయం చేయాలని వారు కోరారు. టీటీడీ ఈఓ ధర్మారెడ్డి సమస్యలను సానుకూలంగా పరిశీలిస్తున్నామని తప్పక న్యాయం చేస్తామని అటవీ కార్మికులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో అటవీ కార్మికుల యూనియన్ ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ రెడ్డి, వాసు, మల్లి, మునికృష్ణ, పురుషోత్తం, కేశవులు, సురేంద్ర, వెంకటరెడ్డి, కృష్ణ, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.