టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంట సంబరాలు మిన్నంటాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఉపాసన ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్టు అపోలో ఆసుపత్రి వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశాయి. చరణ్- ఉపాసనలకు 2012లో వివాహమైంది. వీరిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నట్టు గతేడాది డిసెంబరు 12న ఇరు కుటుంబాలు వెల్లడించాయి. కొన్ని రోజుల క్రితం ఉపాసన సీమంతం వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.
సాధారణంగా ఎవరైనా దంపతులు పిల్లలు పుట్టిన తర్వాత వేరు కాపురం పెడుతుంటారని, తాము దానికి పూర్తి భిన్నమని ఉపాసన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రస్తుతం తాను, చరణ్.. అత్తమామలతో కాకుండా విడిగా ఉంటున్నామని, బిడ్డ పుట్టిన తర్వాత అత్తమామల (చిరంజీవి- సురేఖ)తోనే ఉండాలని నిర్ణయించుకున్నామని ఉపాసన తెలిపారు. తమ ఎదుగుదలలో గ్రాండ్ పేరెంట్స్ కీలక పాత్ర పోషించారని, వారితో ఉంటే వచ్చే ఆనందాన్ని తమ బిడ్డకు దూరం చేయాలనుకోవాలని లేదని చెప్పారు