SAKSHITHA NEWS

వంద కేజీల కంటే ఎక్కువ చెత్త ఉత్పత్తి చేసే వారు కంపోస్టుగా మార్చండి.. కమిషనర్ ఎన్.మౌర్య

తిరుపతి నగరంలో వంద కేజీల కంటే ఎక్కువ చెత్త ఉత్పత్తి చేసే వాణిజ్య సముదాయాలు, అపార్ట్మెంట్స్ (బల్క్ జనరేటర్స్) వారు తడిచెత్తను మీ పరిధిలోనే కంపోస్టుగా మార్చుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. నగరంలో చెత్త ఎక్కువ ఉత్పత్తి చేసే వాణిజ్య సముదాయాలు, అపార్ట్మెంట్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలతో సాయంత్రం కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తిరుపతి నగరంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద హోటల్స్, అపార్ట్మెంట్స్, రెస్టారెంట్ల వారు100 కేజీల కంటే ఎక్కువ చెత్తని ఉత్పత్తి చేస్తున్నారని అన్నారు. ఎవరైతే 100 కేజీల కంటే ఎక్కువ చెత్తని ఉత్పత్తి చేస్తున్నారో వారంతా తడిచెత్తను వాళ్ళ పరిధిలోనే కంపోస్ట్ గా మార్చుకుని, పొడిచెత్తను నగరపాలక సంస్థ సిబ్బందికి అందించాలనే ప్రభుత్వ నిబంధన ఉందన్నారు.

కావున ఈ తడిచెత్తను మెకనైజ్డ్ సిస్టం, బయో గ్యాస్ సిస్టం ద్వారా గాని లేదా ఇంకా ఇతర పద్ధతుల ద్వారా అయినా తడిచెత్తని వాళ్ళ పరిధిలో ఎరువు(కంపోస్టు) గా మార్చుకోవచ్చునని అన్నారు. ఈ ఎరువును వారే చెట్లకి, గార్డెన్స్ కి ఉపయోగించుకోవాలని అన్నారు. అలాగే నగరంలో ఎక్కువ చెత్త ఉత్పత్తి చేస్తున్నటువంటి వాణిజ్య సముదాయాలు, హోటల్స్ , రెస్టారెంట్లు, అపార్ట్మెంట్ల వారిపై సర్వే నిర్వహిస్తామని అన్నారు. ఇందులో వంద కేజీల కంటే ఎక్కువ ఉత్పత్తి చేసే వారిని గుర్తించి వారిని సమావేశ పరిచి ఈ నిభందనలు వివరిస్తామని అన్నారు. అందరూ చెత్తని ఖచ్చితంగా మూడు రకాలుగా విభజించి ఇవ్వాలని కమిషనర్ ఆదేశించారు. తాము చెప్పిన ప్రకారం చేస్తే కాలువల్లో చెత్త వేయడం, నగరంలో చెత్త కుప్పలు లేకుండా చేసేందుకు వీలు అవుతుందని అన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని వారికి అపరాధరుసుము విధిస్తామని హెచ్చరించారు. నగరంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని, గుడ్డ, పేపర్ కవర్లు, జ్యూట్ బ్యాగులు కస్టమర్లకు ఇవ్వాలని అన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, శానిటరీ సూపర్ వైజర్లు చెంచయ్య, సుమతి, మస్తాన్, అజయ్, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS