This year the officials have worked as they did last year
అధికారులు గత సంవత్సరం పని చేసినట్లుగానే ఈ సంవత్సరం కూడా అదే కృషి తో ముందుకు సాగాలన్నారు.
-జిల్లా కలెక్టర్ వీ పి గౌతమ్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
అధికారులు 2022 వ సంవత్సరంలో చక్కగా పనిచేసి ప్రభుత్వ పథకాల అమలు, జీవో 58, 59 అమలులో కృషి చేశారని, 2023వ సంవత్సరం లోను ఇదే కృషిని కొనసాగించి, ప్రజలకు మేలు చేయాలని కలెక్టర్ అన్నారు.
జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో అధికారులతో పీఎంఏజెఏవై, దళితబంధు, అభివృద్ధి పనులకు ప్రభుత్వ భూముల కేటాయింపు, రెవిన్యూ సమస్యల పరిష్కారం పై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన క్రింద గ్రామాలను ఎంపిక చేస్తారని, అట్టి గ్రామాల అభివృద్ధికి రూ. 20 లక్షల గ్రాంట్ ఇస్తారని అన్నారు.
అభివృద్ధి కార్యక్రమాల్లో మౌళిక సదుపాయాల కల్పనలో లోట్లను భర్తీ చేసుకోవచ్చన్నారు. సబ్ సెంటర్, అంగన్వాడీ కేంద్రాల్లో మరమ్మత్తులు, ఫర్నీచర్, సౌకర్యాల కల్పన లాంటివి చేపట్టాలన్నారు. రెగ్యులర్ నిధులతో పూర్తికాని పనులను ఈ పథకం ద్వారా పూర్తికి చర్యలు తీసుకోవాలని అన్నారు.
గ్రామాల్లో పథక అమలుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. దళితబంధు మిగులు యూనిట్ల గ్రౌండింగ్ కు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. డెయిరీ యూనిట్లు ఇంకనూ 132 పెండింగులో ఉన్నాయని ఆయన అన్నారు. 93 రవాణా వాహనాల యూనిట్లను డీలర్లపై వత్తిడి తెచ్చి గ్రౌండింగ్ చేయాలన్నారు.
ఉత్పాదక యూనిట్లలో లోపాలుంటే వెంటనే సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అభివృద్ధి పనులకు ప్రభుత్వ శాఖలచే స్థల కేటాయింపు ప్రతిపాదనల మంజూరుపై శాఖల వారిగా కలెక్టర్ సమీక్షించారు. గ్రామ పంచాయితీ భవనాలు, గోడౌన్ల నిర్మాణం, ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లు, పల్లె ప్రకృతి వనాలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ స్థలాల గుర్తింపు ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
టీఎం-33 పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం 15 జనవరిలోగా పూర్తి చేయాలన్నారు. పివోబీ, రెవిన్యూ సమస్యల దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్, డిఆర్వో శిరీష, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.