SAKSHITHA NEWS

ఎక్కడైతే గౌరవం దక్కుతుందో ఆ పార్టీలో చేరుతా.. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

సార్వత్రిక ఎన్నికలైన తరువాత నుంచి వైసీపీ జగన్‌కు షాక్ లా మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొన్న మాజీ మంత్రి ఆళ్ల నాని, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌లు వైసీపీకి బై బై చెబుతూ షాక్ ఇచ్చారు.

వైఎస్సార్‌సీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్‌కు పంపుతూ రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రకటించారు. భీమవరం నుంచి 2014లో వైకాపా తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఓటమి, తరువాత 2019లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విజయం సాధించారు. అప్పటి నుంచి వైసీపీలోని ప్రతి కార్యక్రమంలోనూ చురుగ్గా పాల్గొనేవారు. గత 5 ఏళ్లలో మంత్రి పదవి వస్తుందని ఆశాభావం ఉండేవారని, కానీ మాజీ ఎమ్మెల్యే గ్రంధికి నిరాశనే మిగిలింది. ఇటీవలే జరిగిన ఐటీ రైడ్స్, అధిష్టానం నుంచి కూడా ఎటువంటి సమాధానం లేకపోవడంతో నిరాశ చెందిన ఆయన రాజీనామా చేస్తున్నారనే ఊహాగానాలు వచ్చాయి. అదే రీతిలో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించి వైసీపీకి గట్టి షాక్ ఇచ్చారు. గురువారం ఆయన క్యాంప్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడారు.

సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేరని, అందుకు తగ్గ ఆర్థిక వనరులు ప్రభుత్వం వద్ద లేవని గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పారని గ్రంధి శ్రీనివాస్ పేర్కొన్నారు. చంద్రబాబు అమలు చేయలేరని తెలిసిన ప్రజలు ఆయనకి ఓట్లు వేసి గెలిపించారన్నారు. ప్రభుత్వం వద్ద డబ్బు లేదని, పథకాలు అమలు చేయడం సాధ్యం కాదని తెలిసినా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలంటూ జగన్ ఎలా డిమాండ్ చేస్తారని ప్రశ్నించారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు సాధ్యం కాదని తెలిసిన వాటిపైన ఉద్యమాలు ఆందోళనలు ఎలా చేయమంటారని అడిగారు. జగన్ ప్రభుత్వానికి మంచి పేరు రావాలని అప్పులు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వారికి బిల్లులు చెల్లించలేదన్నారు. వాలంటరీ వ్యవస్థ వల్ల కార్యకర్తలకు, నాయకులకు విలువ లేకుండా పోయిందన్నారు. ఏ పార్టీలో చేరాలనేది కుటుంబ సభ్యుల లాంటి కార్యకర్తలు, నాయకులతో చర్చించిన తర్వాత నిర్ణయం ఉంటుందన్నారు. ఎక్కడైతే గౌరవం దక్కుతుందో ఆ పార్టీలో చేరుతానని గ్రంధి శ్రీనివాస్ స్పష్టం చేశారు.


SAKSHITHA NEWS