సాక్షిత : దేశంలోని ఏ స్కాంలు చూసిన బీజేపీ నేతలే ఉంటారు…
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేపర్ లీకేజీల సంగతేంటి?
ఉద్యోగార్థులను విపక్ష నేతలు భయాందోళనకు గురి చేస్తున్నారు…
బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడయా సమావేశంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
TSPSC పేపర్ లీక్ పై విపక్ష నేతలు చేస్తున్న విష ప్రచారాన్ని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ తీవ్రంగా తప్పుబట్టారు. హైదరాబాద్ లోని బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ మాట్లాడుతూ.. పేపర్ లీక్ వ్యవహారంలో యువతను తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రను యావత్ తెలంగాణ సమాజం గమనిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగి దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తూ ముందుకు వెళుతున్న తరుణంలో ప్రతిపక్షాలు ఓర్వలేక దుష్ప్రచారాలు చేస్తున్నాయన్నారు. సీఎం కేసీఆర్ ని ఎదుర్కోలేక నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారన్నారు. ఆధార రహితంగా ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే సిట్ వేసి దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా.. ఇందుకు సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్ బాధ్యత వహించాలని విపక్షాలు ఆరోపణలు చేయడం అర్థరాహిత్యం అన్నారు.
మంత్రి కేటీఆర్ కి అంతర్జాతీయంగా వస్తున్న గుర్తింపు, రాష్ట్రానికి వారు తీసుకువస్తున్న వేల కోట్ల పెట్టుబడులను చూసి బండి సంజయ్ ఓర్వలేక పోతున్నాడన్నారు. బండి సంజయ్ గతంలో కూడా ఇదే తరహా ఇంటర్ మీడియట్ పేపర్ లీక్ విషయంలో తప్పుడు ఆరోపణలు చేసి కోర్టులో పరువునష్టం దావాను ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తు చేశారు. బండి సంజయ్ ఓర్వలేకే మంత్రి కేటీఆర్ ని రాజీనామా చేయాలని ఆరోపిస్తున్నాడని, ఇదే పరీక్షకు సంబంధించి భారత దేశంలోనే అతిపెద్ద స్కాండల్ మధ్య ప్రదేశ్ లో జరిగిందని, దాదాపు 2 వేల మంది అరెస్టు అయ్యి.. ఇందులో భాగమైన 46 మంది అనుమానాస్పదంగా మరణించారని ఇంత జరిగినా? ఆ రాష్ట్ర సీఎం ఎందుకు రాజీనామా చేయలేదో బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు? అంతే గాక సాక్షాత్తు నరేంద్ర మోడీ సీఎంగా ఉన్న గుజరాత్ రాష్ట్రంలోనూ పలు సందర్భాల్లో పేపర్ లీక్ వ్యవహారాలు జరిగి తిరిగి పరీక్షలు సాగాయని, అయితే నరేంద్ర మోడీని రాజీనామా చేయిస్తారా అని బండి సంజయ్ ని ప్రశ్నించారు? దేశంలోని ఏ స్కాంలు చూసిన బిజెపి నేతలే ఉంటున్నారన్నారు.
అ, ఆ లు రాని వారిని సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా నియమిస్తున్నారన్నారు. దేశానికి అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా ఉన్న తెలంగాణలో అలజడి సృష్టించాలని బిజేపి కుట్రలు చేస్తుందని స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. పేపర్ లీక్ వ్యవహారంలో ఉన్నది బండి సంజయ్ ప్రధాన అనుచరుడు, బిజేపి నాయకుడు రాజశేఖర్ అని సాక్ష్యాలతో బయటపెట్టామన్నారు. బిజేపి అనేక కార్యక్రమాల్లో రాజశేఖర్ పాల్గొనేవాడన్నారు. గందరగోళానికి అసలు కారణమే బిజేపి నాయకుడన్నారు. నోటిఫికేషన్ ను ఎలాగైనా రద్దు చేసి యువకులను బిజేపి వారి వెనక తిప్పుకోవాలనే కుట్ర చేస్తున్నారన్నారు. అస్సాం, గుజరాత్, త్రిపుర వంటి రాష్ట్రాల్లో పేపర్ లీక్ వ్యవహారాలు జరిగాయని అందులో బిజేపి నేతలే ఉన్నారని వెల్లడైందన్నారు. అన్ని రంగాల్లో బిజేపి నేతలు ఉండాలన్నది వారి సంప్రదాయంగా వస్తుందన్నారు. బండి సంజయ్ మాట్లాడే ముందు మొదట ఆయా రాష్ట్రాల్లో రాజీనామాలు చేయించి ఇక్కడ మాట్లాడాలన్నారు. పరీక్షలు నిర్వహించేది ఎవరు, ఏ విధంగా జరుగుతాయనే జ్ఞానం కూడా బండి సంజయ్ కి లేదన్నారు. బండి సంజయ్ అజ్ఞాని అని విమర్శించారు.
వివేక్ వెంకట స్వామి వెంటనే క్షమాపణ చెప్పాలి…
బిజేపి నేత వివేక్ వెంకటస్వామి ఓ పారిశ్రామిక వేత్త, న్యూస్ ఛానెల్ కూడా నడిపిస్తున్నాడని అయితే నవీన్ ఆత్మహత్యకు కేసీఆర్ ప్రభుత్వమే కారణం అని అతని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం అతని విజ్ఞతకే వదిలేయాలన్నారు. తమకు పేపర్ లీక్ తో ఎటువంటి సంబంధం లేదు అని స్వయానా వారి కుటుంబ సభ్యులే చెబుతూ ఉంటే బిజేపి నేతలు మాత్రం చదువుకున్నా దుష్ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే బిజేపి నేతలు కుట్రలు చేస్తూ, అడ్డంకులు సృష్టించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఎదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వివేక్ వెంకట స్వామి వెంటనే ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ తక్షణమే తన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు.