SAKSHITHA NEWS

హైదరాబాద్‌: మేడారంలో ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభమయ్యే సమ్మక్క, సారలమ్మ జాతరకు విస్తృతస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి తెలిపారు. జాతర నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో శనివారం ఆమె సచివాలయం నుంచి టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ.. ‘జాతరలో దాదాపు 4,800 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 6,000 బస్సులను మేడారానికి నడుపుతున్నాం. దాదాపు 9,000 మంది బస్‌ డ్రైవర్లను నియమించాం. జాతరలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకు 4,000 మంది కార్మికులను నియమించాం. 5,600 మరుగుదొడ్లను ఏర్పాటు చేయడంతో పాటు నిర్వహణకు వెయ్యి మందిని నియమించాం. గద్దెల దర్శనానికి క్యూ-లైన్ల ఏర్పాటు పూర్తయింది. జాతరలో కల్తీ ఆహార పదార్థాలను నిరోధించడానికి ఫుడ్‌ చెకింగ్‌ ఇన్‌స్పెక్టర్లనూ నియమించాం. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ పర్యవేక్షణకు ఐదుగురు ఐఏఎస్‌ అధికారులను నియమిస్తున్నాం’ అని తెలిపారు. టెలీకాన్ఫరెన్స్‌లో డీజీపీ రవిగుప్తా, ఎండోమెంట్స్‌, ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌ శర్మ, ముఖ్య కార్యదర్శులు శ్రీనివాసరాజు, సందీప్‌కుమార్‌ సుల్తానియా, రిజ్వీ, వాణీ ప్రసాద్‌, నాగిరెడ్డి, రాహుల్‌ బొజ్జా, క్రిస్టినా జెడ్‌ చోంగ్తు, శరత్‌ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS