SAKSHITHA NEWS

రాష్ట్ర ప్రభుత్వం మహిళలను సంపూర్ణ ఆరోగ్యవంతులను చేయడమే లక్ష్యంగా ఆరోగ్య మహిళా కేంద్రాలను ఏర్పాటు చేసింది.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్;

రాష్ట్ర ప్రభుత్వం మహిళలను సంపూర్ణ ఆరోగ్యవంతులను చేయడమే లక్ష్యంగా ఆరోగ్య మహిళా కేంద్రాలను ఏర్పాటు చేసిందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి అన్నారు. రఘునాథపాలెం మండలం మంచుకొండ, ఖమ్మం రూరల్ మండలం ఎంవి పాలెం లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా కేంద్రాలను అదనపు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఆరోగ్య కేంద్రానికి వచ్చిన మహిళలతో మాట్లాడుతూ, మహిళా ఆరోగ్య కేంద్రాల ద్వారా 8 విభాగాల్లో మహిళలకు అవసరమైన పరీక్షలు నిర్వహించి, వ్యాధి నిర్దారణ జరిగిన వారికి తదుపరి చికిత్సను పూర్తి ఉచితంగా అందించేందుకు ఆరోగ్య మహిళా కేంద్రాలు దోహదపడతాయని అన్నారు. మహిళ ఆరోగ్యం ఇంటికి సౌభాగ్యం అనే లక్ష్యంతో మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రత్యేకంగా ఆరోగ్య మహిళా కేంద్రాలను ప్రారంభించిందని ఆమె తెలిపారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు ఆరోగ్య మహిళా కేంద్రం నిర్వహణ పట్ల విస్తృత ప్రచారం నిర్వహించి, మహిళలందరికీ వైద్య సేవలు అందే విధంగా కృషి చేయాలని ఆమె అన్నారు. ప్రాథమిక డయాగ్నాస్టిక్, క్యాన్సర్ స్క్రీనింగ్, సూక్ష్మ పోషక లోపాలు, మూత్ర నాళ ఇన్ఫెక్షన్ లు, పి.ఐ.డి., పిసిఓఎస్., కుటుంబ నియంత్రణ, రుతుస్రావ సమస్యలు, మెనోపాజ్ మేనేజ్మెంట్, లైంగిక వ్యాధులు, శరీర బరువు అంశాలు ఆరోగ్య కేంద్రంలో పరీక్షించడం జరుగుతుందని తెలిపారు. క్లినిక్ కు వచ్చే మహిళల వివరాలను ప్రత్యేక యాప్ లో పకడ్బందీగా నమోదు చేయాలని, యాప్ లో నమోదు చేస్తున్న వివరాలను ఆమె పరిశీలించారు. అవసరమైన వైద్య చికిత్సల కోసం రిఫరల్ చేసిన కేసులను ఆశా కార్యకర్తల ద్వారా ఫాలోఅప్ చేయాలని అదనపు కలెక్టర్ తెలిపారు. మహిళలు ఆరోగ్య మహిళా కేంద్రంలో ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య మహిళా కేంద్రం వైద్యాధికారి డా. శ్రీదేవి, ఖమ్మం రూరల్ మండలం ఎంపిడిఓ అశోక్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS