మండల పరిధిలో ప్రభుత్వ పథకాల అమలు వేగవంతం చేయాలి
విధుల నిర్వహణలో నిర్లిప్తత, అలసత్వం పనికిరాదు మంజూరైన ప్రతి ఇంటిని జియో ట్యాగింగ్ పూర్తి చేయాలి
పిజిఆర్ఎస్ దరఖాస్తులు అత్యంత ప్రాధాన్యతగా పరిష్కరించాలి కలికిరి, సంబేపల్లి మండలాలలో సుడిగాలి పర్యటన చేసిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి
కలికిరి, సంబేపల్లి, మండల పరిధిలో ప్రభుత్వ పథకాల అమలు వేగవంతం చేయాలి. విధుల నిర్వహణలో నిర్లిప్తత, అలసత్వం పనికిరాదని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఉదయం కలికిరి, సంబేపల్లె మండలాలలో కలెక్టర్ సుడిగాలి పర్యటన చేసి వివిధ పథకాల అమలు తీరును పరిశీలించారు.
ఇందులో భాగంగా కలికిరి సంబేపల్లి ఎంపీడీవో కార్యాలయాలలో… పి జి ఆర్ ఎస్, అపార్ ఐడి జారీ, గృహ నిర్మాణ ప్రగతి, నవశకం పోర్టల్ లో బ్యాంక్ అకౌంట్ ఆధార్ లింకేజీ, స్కిల్ సెన్సస్ తదితరాలలో తాసిల్దార్, ఎంపీడీవో, మండల సర్వేయర్లు, వీఆర్వో, ఎంఈఓ, హౌసింగ్ ఏఈలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, పంచాయతీ సెక్రటరీలు తదితరులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పిజిఆర్ఎస్ దరఖాస్తులు ఎన్ని వచ్చాయి, పరిష్కరించినవి ఎన్ని, ఇంకను పరిష్కారం చేయాల్సినవి ఎన్ని, పెండింగ్ ఉండడానికి గల కారణాలు ఏమిటి, వాటిని ఎప్పటిలోగా పరిష్కరించాలి, తీసుకున్న చర్యలు తదితరాలపై తాసిల్దారు, వీఆర్వోలతో సమీక్షించి తగు సూచనలు జారీ చేశారు. ప్రతి దరఖాస్తును వేగవంతంగా, నాణ్యతగా పరిష్కరించాలని తెలిపారు.
అపార్ ఐడి ప్రగతి పై సమీక్షించారు. ఐడి క్రియేట్ చేయడంలో జాప్యం చేయరాదని చెప్పారు. వీఆర్వో, పంచాయతీ సెక్రెటరీ ప్రతి పాఠశాలను సందర్శించి, బర్త్ సర్టిఫికెట్లు లేనివారికి నా అవైలబిలిటీ సర్టిఫికెట్ ఇచ్చి లేట్ బర్త్ సర్టిఫికెట్ జారీ చేయాలని, అనంతరం విద్యార్థుల ఆధార్ అప్డేషన్ కొరకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
హౌసింగ్ కు సంబంధించి లేఅవుట్ వారీగా దశల వారి ప్రగతిపై మండల ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమీక్ష చేశారు. తుది దశలో ఉన్న ఇండ్లను వెంటనే పూర్తి చేయాలన్నారు. అలాగే బిఎల్, ఆర్ఎల్ దశల ప్రగతిని సమీక్షించారు. ఇల్లు పూర్తి చేసుకోవడానికి ఎవరికైనా డబ్బులు అవసరం ఉంటే డ్వాక్రా సంఘాల ద్వారా రుణాలు మంజూరు చేయించాలని ఏపీఎంకు సూచించారు. బిఎల్ నుంచి ఆర్ఎల్ వరకు నిర్మాణంలో ఉన్న ప్రతి లబ్ధిదారు ఇంటికి వెళ్లి నిర్మాణం పూర్తి చేసుకునేలా ప్రోత్సహించాలని తెలిపారు. ఇప్పటికే ఇండ్లు ఉన్నవారికి ఎవరికైనా పట్టా ఇచ్చి ఉంటే రద్దు చేయాలని తాసిల్దార్ను ఆదేశించారు. ఇండ్ల నిర్మాణ ప్రగతి పై ప్రతిరోజు హౌసింగ్ సిబ్బందితో సమీక్ష చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు. మంజూరైన ప్రతి ఇంటిని మూడు రోజుల్లోపు జియో ట్యాగింగ్ చేయాలని సూచించారు. సిటిజన్ చార్ట్ మేరకు రెవిన్యూ సర్వీసులను నిర్ణీత కాలపరిమితిలోగా పారదర్శకంగా అందజేయాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం వివిధ అంశాల్లో పలు సూచనలు జారీ చేశారు.
హౌసింగ్ లేఅవుట్ సందర్శించిన కలెక్టర్
కలికిరీ రెడ్డివారిపల్లి 1 లేఔట్ ను కలెక్టర్ అధికారులతో సందర్శించి నిర్మాణంలో ఉన్న ఇండ్లను పరిశీలించారు. సదరు లేఔట్ లో ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ప్రగతిలో ఉన్న వాటి సంఖ్య ఎంత అని మండల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ను కలెక్టర్ ప్రశ్నించగా… లేఅవుట్లో 203 ఇల్లు మంజూరు అయ్యాయని, 120 ఇళ్ళు ప్రగతిలో ఉన్నవని, మిగిలినవి కూడా వివిధ దశలో ఉన్నట్లు కలెక్టర్కు వివరించారు. తుది దశలో ఉన్న ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయించాలని సూచించారు.
అంగన్వాడీ ప్రీస్కూల్ సందర్శించిన కలెక్టర్
సంబేపల్లి అంగన్వాడి ప్రీ స్కూల్ ను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అటెండెన్స్ పరిశీలించారు. ఎంతమంది పిల్లలు ఉన్నారు, హాజరు శాతం ఎంత, సరిగా హాజరు కాని వారి గురించి కారణాలు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడి స్కూల్ ను మరింత మెరుగుగా నిర్వహించాలని టీచర్లు, ఆయాలు, సూపర్వైజర్ కు సూచించారు.
సంబేపల్లి ప్రకాష్ నగర్ కాలనీలో ఒకే పట్టాను ఇరువురు వ్యక్తులకు ఇచ్చిన అంశంలో… స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి రికార్డులను, స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. రికార్డుల్లో ఉన్న ఆధారాల మేరకు లబ్ధిదారుకు ప్రభుత్వం మంజూరు చేసిన ఆరు సెంట్లు స్థలాన్ని మక్కాగా కొలతలు వేసి అందజేయాలని, మరొక వ్యక్తికి అర్హతను బట్టి వేరే ప్రాంతంలో ఇంటి పట్టా మంజూరుకు సిఫారసు చేయాలని అధికారులు కలెక్టర్ సూచించారు.
ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని రక్షణ ఏర్పాటు చేయండి
సంబేపల్లి మండలంలోని మూటకట్ల రెవెన్యూ గ్రామం సర్వే నెంబర్ 467లో 40 సెంట్లు ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతోందని గ్రామస్తుల ఫిర్యాదు మేరకు… సదరు స్థలాన్ని కలెక్టర్ క్షేత్రస్థాయికి వెళ్లి స్వయంగా పరిశీలించారు. రికార్డులను పరిశీలించారు. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని వెంటనే స్వాధీనం చేసుకొని, రక్షణ ఏర్పాటు చేసి, హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని తాసిల్దార్ ను కలెక్టర్ ఆదేశించారు. ఎవరైనా ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సీసీ రోడ్లు నాణ్యతగా పూర్తి చేయాలి
పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా… మండలంలోని ఎర్రగుంట్ల గ్రామం లో హైవే నుంచి కేజీబీవీ స్కూల్ అంబేద్కర్ గురుకుల పాఠశాల వరకు 287 మీటర్ల మేర నిర్మించిన సిసి రోడ్డు ను కలెక్టర్ పరిశీలించారు. రోడ్ల నిర్మాణం నాణ్యతలో ఎక్కడ రాజీ పడరాదని అధికారులకు సూచించారు. పనులన్నీ డిసెంబర్ మాసంతంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మదనపల్లి, రాయచోటి ఆర్డీవోలు రాఘవేంద్ర, శ్రీనివాస్, హౌసింగ్, డ్వామా పీడీలు శివయ్య, వెంకటరత్నం, డిపిఓ బలరామిరెడ్డి, డిఆర్డిఏ పిడి సత్యనారాయణ, ఎంఈఓ లు, హౌసింగ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వీఆర్వోలు, పంచాయతీ సెక్రటరీలు, మండల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.