భాషా ప్రయుక్త రాష్ట్రాల పితామహులు పొట్టి శ్రీరాములు
ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు 122వ జయంతి.
జయంతి కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు కృష్ణప్రసాద్ .
ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, 16.3.2023.
భాషా ప్రయుక్త రాష్ట్రాల పితామహులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతిని ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఘనంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ దివంగత పొట్టి శ్రీరాములు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
శాసనసభ్యులు కృష్ణ ప్రసాద్ గారు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు గారి త్యాగం నేటి పోరాట యోధులకు స్ఫూర్తిదాయకమన్నారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని 1952 అక్టోబర్ 19న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారన్నారు. 58 రోజుల పాటు కఠిన నిరాహారదీక్ష చేసి తన ఆశయసాధనలో ప్రాణాలర్పించి 1952 డిసెంబర్ 15న అమరజీవి అయ్యారన్నారు. ఆయన ప్రాణత్యాగం తర్వాత డిసెంబర్ 19న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేస్తూ అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిందన్నారు.
అమరణ దీక్షలో రోజులు గడిచే కొద్దీ ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ మనోధైర్యంతో, పట్టుదలతో తన లక్ష్యాలను సాధించిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన చూపిన పోరాట పటిమ నేటి యువతకు ఆదర్శమన్నారు.
ఈ మహనీయుని జ్ఞాపకార్థం రాష్ట్రప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించిందన్నారు. నెల్లూరు జిల్లా పేరును 2008లో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారన్నారు. పొట్టి శ్రీరాములు గారికి జోహార్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.