వరంగల్ జిల్లా :
కొండా దంపతులపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కొండా మురళి ఘాటు స్పందించారు. శ్రీకృష్ణదేవరాయల వంశీయులం కాబట్టి మీసాలు పెంచుతామని, కేటీఆర్ అటు-ఇటు కాదు కాబట్టి.. ఆయనకు మీసాలు రావని ఎద్దేవాచేశారు. తాను రౌడీనే అయితే అప్పుడు టీఆర్ఎస్లో ఎందుకు చేర్చుకున్నారు? అని ప్రశ్నించారు. కేటీఆర్కు తన పేరు ఉచ్చరించే దమ్ములేదని హెచ్చరించారు. పేదలకు సేవచేస్తే రౌడీ అనుకుంటే తనకు అభ్యంతరం లేదన్నారు. తాను నియోజకవర్గంలో తిరిగితే కేటీఆర్కు ఉచ్చపడుతుందన్నారు. ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ నమ్మకద్రోహిని ఆరోపించారు. సిరిసిల్ల పద్మశాలీలంతా కొండా సురేఖ కు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీచేయమన్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా సురేఖ గెలిచితీరుతుందని మురళి స్పష్టం చేశారు. చదువురాని దయాకరరావును మంత్రిని చేసి మేధావి అయిన కడియం శ్రీహరిని పక్కకు పెట్టారని దుయ్యబట్టారు. ఛత్తీస్గఢ్, కర్ణాటక లో లాగా తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోతుందని కొండా మురళి జోస్యం చెప్పారు.
కొండా దంపతులపై విమర్శ
పరకాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై నిలబడడానికి విపక్షాలు భయపడుతున్నాయని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ధర్మారెడ్డిని చూస్తే మీసాలు తిప్పినోళ్లు భయపడి పక్కకు పోతున్నారని, గుండా గిరి, రౌడీయిజం చేస్తే ఎవరూ భయపడరంటూ పరోక్షంగా కొండా దంపతులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నియోజకవర్గాలను మార్చుకుంటూ పోయేవారు పెద్దపెద్ద నాయకులమని అనుకుంటూ ఉంటారని.. అది ప్రజలు గమనిస్తారని తెలిపారు. ప్రజలను కడుపులో పెట్టుకోవాలని, దబాయించి పనులు చేయించుకుంటామని అనుకుంటే ఎవరూ వినరని స్పష్టం చేశారు…