ఖమ్మం నగరాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి……
–రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వర రావు
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, సాక్షిత:
రాష్ట్రంలోని ఇతర నగరాలకు, పట్టణాలకు మన ఖమ్మం నగరం ఆదర్శంగా ఉండే విధంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.
మంగళవారం మంత్రి, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 46వ డివిజన్ సారథి నగర్ లో పర్యటించి టి.యు.ఎఫ్.ఐ.డి.సి. నిధులు ఒక కోటి రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన స్మార్ట్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ, సెప్టెంబర్ నెలలో అకస్మాత్తుగా భారీ వరదలు వచ్చినప్పటికీ ప్రాణ నష్టం అధికంగా జరగకుండా ప్రజలలో ఉంటూ సేవలు అందించిన ప్రజా ప్రతినిధులకు, ప్రభుత్వ సిబ్బందికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
మున్నేరు వరద, చెరువుల నుంచి వచ్చే వరద పట్టణాన్ని ముంచే పరిస్థితి మరోసారి రాకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి, వరద ఎటు నుంచి వచ్చి ఎలా వెళ్లాలో డిజైన్ చేసేందుకు నిపుణుల కమిటీని నియమించమని ముఖ్యమంత్రిని కోరడం జరిగిందని, భవిష్యత్తులో ఎటువంటి తప్పులు జరగకుండా పకడ్బందీగా వరద నివారణ చర్యలు ప్రభుత్వం చేపడుతుందని మంత్రి అన్నారు. ప్రస్తుతం నిర్మించే మురుగునీటి కాలువల డిజైన్ సైతం పక్కాగా ఉండాలని, మురికి కాలువ నిర్మాణం చివరి వరకు వెళ్లే విధంగా చూడాలని, వీటి నిర్మాణం వల్ల భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రావద్దని మంత్రి ఇంజనీర్లకు సూచించారు. నాలాలు, నీటి ప్రవాహాలలో ఉన్న ఆక్రమణలను తొలగించే సమయంలో మానవతా దృక్పథంతో ఉండాలని మంత్రి తెలిపారు. ఆక్రమణలలో ఉన్న పేదలకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు మరో చోట అందించి, వారిని తరలించిన తర్వాత ఆక్రమణలను తొలగించాలని మంత్రి తెలిపారు.
ఆక్రమణలు తొలగించిన తర్వాతనే నిర్మాణ పనులు ప్రారంభించాలని, ఆయా డివిజన్ల లో కార్పొరేటర్లు పేద ప్రజలతో చర్చించి వారికి మెరుగైన పునరావాసం కల్పించి, వచ్చే వర్షాకాలం నాటికి కాలువ నిర్మాణ పనులు పూర్తయ్యే విధంగా చూడాలని మంత్రి అన్నారు. ఖమ్మంలో వరద నివారణ చర్యలకు ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు చేస్తుందని, వీటిని సరిగ్గా వినియోగించుకోవాలని, మురికి కాలువ నిర్మాణాలు నాణ్యతతో పూర్తి చేయాలని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన మురికి కాలువల నిర్మాణాలు పనులు పూర్తి చేసుకోవడం వల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుందని ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు సహకరించాలని మంత్రి కోరారు. నగరంలో పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజలు తడి, పొడి చెత్త వేర్వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అప్పగించాలని, చెత్తను కాల్వలో వేయవద్దని మంత్రి ప్రజలకు సూచించారు.
ఖమ్మం పట్టణానికి అవసరమైన నిధులు ముఖ్యమంత్రిని అడిగి తీసుకొని వస్తానని, నగరాన్ని పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన ఖమ్మంగా తీర్చిదిద్దాలని, ఖమ్మం నగరంలో మంచి చదువు, వైద్యం, రోడ్లు అందుబాటులోకి రావాలని, ప్రజలంతా ఎటువంటి భేదాలు లేకుండా ఐక్యమత్యంతో ఉండాలని, రాష్ట్రంలోని ఇతర నగరాలకు ఖమ్మం ఆదర్శంగా నిలవాలని, ఇందుకు మనమంతా కృషి చేయాలని మంత్రి పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య, 46వ డివిజన్ కార్పొరేటర్ కన్నం వైష్ణవి, కార్పొరేటర్ కమర్తపు మురళీ, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.