హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన ‘ప్రజాభవన్ వద్ద రోడ్డు ప్రమాద’ కేసులో ఆదివారం మరో ఇద్దరిని పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నిజామాబాద్ ఇన్స్పెక్టర్ ప్రేమ్‌కుమార్, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అనుచరుడు అబ్దుల్‌వాహె ఉన్నారు. వీరిద్దరి నుంచి పశ్చిమ మండలం డీసీపీ విజయ్‌కుమార్ తన కార్యాలయంలో వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ కేసులో నిందితుల సంఖ్య ఎనిమిదికి చేరింది. దుబాయ్‌లో ఉన్నట్లుగా భావిస్తున్న ప్రధాన నిందితుడు సాహిల్‌తోపాటు అతని తండ్రి, మాజీ ఎమ్మెల్యే షకీల్ కోసం పోలీసులు లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. బోధన్ ఇన్స్పెక్టర్గా ఉన్న ప్రేమ్‌కుమార్ ఇటీవలే నిజామాబాద్‌కు బదిలీ అయ్యారు. విధుల్లో చేరాల్సిన ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. గత నెల 23న అర్ధరాత్రి షకీల్ తనయుడు సాహిల్ అలియాస్ రాహిల్ అతివేగంగా కారు నడుపుతూ బేగంపేటలోని ప్రజాభవన్ వద్ద ట్రాఫిక్ డివైడర్లను ఢీకొట్టిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో సాహిల్‌ను తప్పించేందుకు మహారాష్ట్రకు చెందిన డ్రైవర్ అబ్దుల్ ఆసిఫ్(27)ను పంజాగుట్ట ఠాణాకు పంపి కేసు నమోదు చేయించారు. ఇందుకు అప్పటి పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు సహకరించినట్లు బయటపడింది. ఆయన వద్ద స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లలో లభించిన కాల్‌డేటా ఆధారంగా షకీల్, ఇన్స్పెక్టర్ ప్రేమ్‌కుమార్, మరో ఇద్దరితో మాట్లాడినట్లు ఆధారాలు లభించాయి. దీంతో కేసును తారుమారు చేసేందుకు ప్రేమ్‌కుమార్ జోక్యం చేసుకున్నారనే అనుమానంతో అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సాహిల్‌ను ముంబయికి పంపించడంలో షకీల్ అనుచరుడైన అబ్దుల్‌వాహె పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే సస్పెన్షన్‌కు గురైన ఇన్స్పెక్టర్ దుర్గారావుపైనా కేసు నమోదు చేసే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.