SAKSHITHA NEWS

చెన్నై: దేశంలో సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైంది. తొలి దశ పోలింగ్‌కు నోటిఫికేషన్‌ విడుదలవ్వడంతో పలు చోట్ల అభ్యర్థులు నామపత్రాలను సమర్పిస్తున్నారు. తమిళనాడు
లోని విరుదునగర్‌ నుంచి బరిలోకి దిగిన భాజపా అభ్యర్థి, ప్రముఖ నటి రాధికా శరత్‌ కుమార్‌ సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఇందులో తన మొత్తం ఆస్తుల విలువను రూ.53.45కోట్లుగా ప్రకటించారు.

రూ.33.01లక్షల నగదు, 75 తులాల బంగారం, 5 కేజీల వెండి ఆభరణాలు, వస్తువులతో కలిపి రూ.27.05కోట్ల చరాస్తులున్నట్లు రాధిక నామినేషన్‌లో పేర్కొన్నారు. రూ.26.40కోట్ల స్థిరాస్తులతో పాటు రూ.14.79కోట్ల అప్పులు ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె రాడాన్‌ మీడియా వర్క్స్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థకు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.

ఇటీవల రాధిక భర్త, నటుడు ఆర్‌. శరత్‌ కుమార్‌ తన పార్టీ ఆల్‌ ఇండియా సమతువ మక్కల్‌ కట్చి ని భాజపాలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విరుదునగర్‌ నుంచి కాషాయ పార్టీ ఆమెను నిలబెట్టింది. ఈ స్థానానికి తొలి దశలోనే ఏప్రిల్‌ 19న పోలింగ్‌ జరగనుంది. రాధిక ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి.

ఇక విరుదునగర్‌ లో ఈ నటికి పోటీగా దివంగత నటుడు కెప్టెన్‌ విజయకాంత్‌ కుమారుడు విజయ ప్రభాకరన్‌ బరిలోకి దిగారు. అన్నాడీఎంకేతో పొత్తులో భాగంగా డీఎండీకే తరఫున ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. తనకు రూ.17.95కోట్ల సంపద ఉన్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. రూ.2.50లక్షల నగదు, 192 గ్రాముల బంగారం, 560 గ్రాముల వెండి ఆభరణాలు కలిపి రూ.11.38కోట్ల చరాస్తులు, రూ.6.57కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని వెల్లడించారు. రూ.1.28కోట్ల అప్పులు ఉన్నట్లు తెలిపారు…..,,

WhatsApp Image 2024 03 26 at 1.13.59 PM

SAKSHITHA NEWS