SAKSHITHA NEWS

That farmhouse CC footage should be released: Bandi Sanjay

ఫాంహౌస్‌ సిసి ఫుటేజ్ లు బయట పెట్టాలి:బండి సంజయ్

మునుగోడు: తెరాస ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరిగిన వ్యవహారంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మరోసారి స్పందించారు. మొయినాబాద్‌ సమీపంలోని ఫాంహౌస్‌ సీసీ ఫుటేజీలను బయటపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.

మునుగోడులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ అర్వింద్‌, మాజీ ఎంపీ వివేక్‌తో కలిసి ఆయన మాట్లాడారు. ఆ ఫాంహౌస్‌ తెరాస ఎమ్మెల్యేదేనన్నారు. అక్కడికి వచ్చిందీ.. పోలీసులకు ఫిర్యాదు చేసిందీ.. బాధితులుగా ఉన్నదీ తెరాస ఎమ్మెల్యేలేనని చెప్పారు. ఈ తతంగాన్నంతా పోలీస్‌ కమిషనరే నడిపిస్తున్నారని సంజయ్‌ ఆరోపించారు. ఈ వ్యవహారం నుంచి ఆయన తప్పించుకుంటారా?ఆయన్ను ఎవరు కాపాడతారు? అని వ్యాఖ్యానించారు.

‘‘గత వారంలో రోజుల్లో ప్రగతిభవన్‌కు ఎవరెవరు వచ్చారు.. దిల్లీలో సీఎం కేసీఆర్‌ను ఎవరు కలిశారనే విషయాలన్నీ బయటపెట్టాలి. సీపీ, ఎమ్మెల్యేలు, ఆ స్వామీజీల కాల్‌ లిస్ట్‌ బయటకు తీయాలి. సీఎం ఇంటి ల్యాండ్‌ ఫోన్‌ కాల్‌ లిస్ట్‌ కూడా బయట పెట్టాలి. సీఎం చెప్పిన స్క్రిప్ట్‌ ఒకటి.. అక్కడ జరిగిందొకటి. డబ్బులు దొరికితే మీడియాకు చూపించాలి కదా? ఈ విషయాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తాం.

ఈ ఘటనపై సీబీఐ విచారణ జరగాల్సిందే. మునుగోడు ఉప ఎన్నికతో ముడిపడిన సమస్య ఇది. అందుకే ఈసీ కూడా ఫిర్యాదు చేస్తాం. ఈ వ్యవహారంతో సంబంధం లేదని సీఎం కేసీఆర్‌ నిరూపించుకోవాలి. ఆయనకు సంబంధం లేకపోతే రేపు యాదాద్రికి వచ్చి ప్రమాణం చేయాలి. నేనూ వస్తా.. ఉదయం 9 గంటల నుంచి 10 గంటలవరకు అక్కడే ఉంటా. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేందుకే తెరాస నేతలు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు’’ అని బండి సంజయ్‌ ఆరోపించారు.


SAKSHITHA NEWS