Telangana roads are prestigious for the country
దేశానికే ప్రతిష్టాత్మకం తెలంగాణా రోడ్లు
ప్రాధాన్యత క్రమంలో ఎంపీ ల్యాడ్స్ నిధులు
తాజాగా సిమెంట్ రోడ్లకు రూ.30 లక్షలు
టీఆర్ఎస్ లోక్ సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు వెల్లడి
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నాణ్యతతో నిర్మిస్తున్న రహదారుల వల్ల తెలంగాణ కీర్తి ప్రతిష్టలు దేశ, విదేశాల్లో మరింతగా పెరగడంతో పాటు రాష్ట్రాభివృద్ధి శరవేగంగా జరుగుతుందని టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు.
ఈ మేరకు ఇక్కడ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో నిర్మితమైన రహదారులు యావత్ దేశానికే తలమానికంగా ఉండి, అద్దంలా మెరుస్తున్నాయని అన్నారు. బడుగు, బలహీన వర్గాల శ్రేయస్సు, అభివృద్దే లక్ష్యంగా రహదారుల నిర్మాణం జరుగుతుందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మారుమూల గ్రామాలను ప్రధాన రహదారులకు కలుపుతూ నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. ఫలితంగా ఆయా మార్గాల్లో ట్రాఫిక్ సమస్యలు తొలగిపోవడమే కాకుండా సరుకు రవాణా, రాకపోకలకు మార్గం సుగామం అవుతుందన్నారు. ముఖ్యంగా రైతులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటున్నాయని చెప్పారు. ఫలితంగా ప్రజల ఆదాయాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
రహదారుల నిర్మాణం, విస్తరణ, బలోపేతంతో మరింత అభివృద్ధికి అవకాశం ఏర్పడిందన్నారు. రోడ్ల నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం మేటిగా ఉందన్నారు. సీఎం కేసీ ఆర్ గ్రామీణ రోడ్లకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో భారీగా రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని, ప్రాధాన్యత క్రమంలో సామాజిక అంశాలను పరిగణలోకి తీసికొని ఎంపీ ల్యాడ్స్ నిధులను సిమెంట్ రోడ్ల నిర్మాణానికి మంజూరు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
ప్రజల అవసరాలను పరిగణలోకి తీసుకుని, రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటుందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జాతీయ, రాష్ట్రీయ, జిల్లా, గ్రామీణ అన్ని రకాల రహదారుల అభివృద్ధికి పెద్ద ఎత్తున కృషి చేయడం జరిగిందని, జరుగుతుందని నామ చెప్పారు.
ఇటీవల వైరా, పాలేరు నియోజక వర్గ పర్యటన సందర్బంగా ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు రహదారుల గురించి తన దృష్టికి తీసుకొచ్చారని నామ చెప్పారు.వారి వినతులను పరిగణలోకి తీసుకుని తాజాగా ఎంపీ ల్యాడ్స్ కింద ఆరు రోడ్లకు రూ. 30 లక్షలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.
సామాజిక వర్గాల వారీగా రోడ్లకు నిధులు మంజూరులో ప్రాధాన్యత ఉంటుందని నామ చెప్పారు, కొణిజర్ల మండలం లింగగూడెం, నేలకొండపల్లి మండలం చెన్నారంలలో ఎస్సీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించి, సిమెంట్ రోడ్లను మంజూరు చేశామన్నారు. అలాగే కూసుమంచి మండలం లోక్యాతండలో ఎస్టీ, వైరా మండలం తాటిపూడి, ముదిగొండ మండలం కమలాపురంలో జనరల్ కేటగిరి కింద సిమెంట్ రోడ్లకు నిధులు మంజూరు చేయడం జరిగిందని ఎంపీ నామ తెలిపారు