SAKSHITHA NEWS

WhatsApp Image 2023 08 24 at 4.58.21 PM

పేద ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చాలనేది తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ర్యాండో మైజేషన్ పద్దతిలో NIC అధికారులు ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్ వేర్ సహకారంతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్దిదారుల ఎంపికను హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సెప్టెంబర్ 2 వ తేదీన కుత్భుల్లా పూర్ లో మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ ని ప్రారంభిస్తారని చెప్పారు.

GHMC పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లో ఒక్కో నియోజకవర్గ పరిధిలో 500 మంది లబ్దిదారులకు చొప్పున మొదటి విడతలో 12 వేల ఇండ్లను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. మూసీ నది అభివృద్ధిలో భాగంగా చేపట్టనున్న ఆక్రమణల తొలగింపుతో నిరాశ్రయులు కానున్న సుమారు 9 వేల మంది బాధితులకు కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించనున్నట్లు చెప్పారు. పేదలు సైతం గొప్పగా బ్రతకాలనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రభుత్వం నిర్మించి అర్హులైన పేదలకు ఉచితంగా అందజేస్తుందని వివరించారు. ఒక్కో ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం 9.50 లక్షల రూపాయలు చొప్పున ఖర్చు చేసినట్లు చెప్పారు.

ఈ ఇండ్ల కేటాయింపు కు సంబంధించి అర్హుల ఎంపిక లో ఎలాంటి విమర్శలకు తావు లేకుండా పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో మొదటిసారిగా అన్ లైన్ డ్రా నిర్వహించినట్లు చెప్పారు. ఈ సాఫ్ట్ వేర్ తో ఎలాంటి అవకతవకలకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు నామమాత్రపు ఆర్ధిక సహాయం అందించి ఇరుకైన, సరైన వసతులు లేని ఇండ్లను నిర్మించినట్లు వివరించారు. ఆ ఇండ్ల నిర్మాణం కోసం లబ్దిదారులు బ్యాంకుల నుండి రుణాలు తీసుకొని చెల్లించలేక అనేక అవస్థలు పడ్డారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేదల ఇబ్బందులను గుర్తించిన ముఖ్యమంత్రి పెద్ద మనసుతో వారి రుణాలను మాఫీ చేశారని వివరించారు. తెలంగాణా ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తిస్థాయి లో పంపిణీ చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ళ MP రంజిత్ రెడ్డి, GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ మధుసూదన్, DRO వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS