టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్
- అన్ స్టాపబుల్ షోలో నిజాలు చెప్పినందుకా ఎన్టీఆర్ కుటుంబంపై దుర్భాషలు
- ఆనాడు ఏం జరిగిందో ప్రజల ముందు పెట్టారు కదా
- కొడాలి నాని చెప్పినవన్నీ అబద్దాలని తేలిపోయింది
- తట్టుకోలేకే బాలకృష్ణ, చంద్రబాబుపై మళ్ళీ దుష్ప్రచారం
- రిషికొండలో రోడ్లను తిరుమల కొండతో పోల్చడం దారుణం
- టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్
*సాక్షితగుడివాడ : అన్ స్టాపబుల్ షోలో ప్రజలకు నిజాలు చెప్పినందుకే ఎన్టీఆర్ కుటుంబంపై ఎటువంటి సంబంధం లేని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని దుర్భాషలాడుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ అన్నారు. గురువారం కృష్ణాజిల్లా గుడివాడలో శిష్ట్లా లోహిత్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ నిర్వహించే అన్ స్టాపబుల్ షోకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును, ఆయన కుమారుడు నారా లోకేష్ ను ఆహ్వానించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, చంద్రబాబు మధ్య జరిగిన కొన్ని ముఖ్య ఘట్టాలపై చర్చ సాగిందన్నారు. ఆనాడు ఏం జరిగిందో కళ్ళకు కట్టినట్టుగా బాలకృష్ణ సమక్షంలో చంద్రబాబు ప్రజల ముందు పెట్టారన్నారు. దీంతో గత పదేళ్ళుగా ఎన్టీఆర్ కుటుంబంపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చెబుతున్నవన్నీ అబద్దాలని తేలిపోయిందన్నారు. ఎన్టీఆర్ కుటుంబంపై జరుగుతున్న దుష్ప్రచారానికి ఆ కుటుంబ సభ్యులే చెక్ పెట్టారన్నారు. దీన్ని తట్టుకోలేని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మళ్ళీ బాలకృష్ణ, చంద్రబాబుపై దుష్ప్రచారం చేయడం ప్రారంభించారన్నారు. చంద్రబాబుకు రెండుసార్లు టీడీపీ సీటు ఇస్తే ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారని ఎమ్మెల్యే కొడాలి నాని పదేపదే విమర్శలు చేస్తూ వస్తున్నారన్నారు. అదే చంద్రబాబు కూడా ఎమ్మెల్యే కొడాలి నానికి రెండుసార్లు టీడీపీ సీటును ఇస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడాన్ని ఏ విధంగా అర్ధం చేసుకోవాలో చెప్పాలన్నారు. ఇదిలా ఉండగా రైతుల ముసుగులో కృత్రిమ ఉద్యమం జరుగుతోందని ఎమ్మెల్యే కొడాలి నాని చేస్తున్న విమర్శలను తప్పుబట్టారు. అమరావతి రైతులకు ఎవరి సానుభూతి అవసరం లేదన్నారు. రైతుల ఉద్యమంపై నిజాలు చెప్పే మీడియా పైన కూడా దాడి చేయడం దురదృష్టకరమన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలనే లక్ష్యంతో రైతులు మహా పాదయాత్ర చేస్తున్నారని, దీన్ని వైసీపీ నాయకులు మసిపూసి మారేడుకాయ చందంగా చేస్తున్నారన్నారు. రిషికొండలో జరుగుతున్న రోడ్ల నిర్మాణాలను తిరుమల కొండతో పోల్చడం దారుణమన్నారు. 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తారని శిష్ట్లా లోహిత్ హెచ్చరించారు.