SAKSHITHA NEWS

సాక్షిత : విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి శనివారం చండీగఢ్‌లో పర్యటించారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, గవర్నరు బండారు దత్తాత్రేయ, పంజాబ్‌ గవర్నరు భన్వర్‌లాల్‌ పురోహిత్‌లను కలిసారు. వచ్చే నెల(జూలై) 3వ తేదీ నుండి రిషికేష్‌లో చేపడుతున్న చాతుర్మాస్య దీక్ష ఆహ్వాన పత్రికను వారికి అందజేసారు. సెప్టెంబరు 29వ తేదీ వరకు దీక్ష కొనసాగుతుందని, దీక్షా కాలంలో విశాఖ శ్రీ శారదాపీఠం రిషికేష్‌ ఆశ్రమాన్ని సందర్శించాలని కోరారు. గతంలో విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించిన హర్యానా సీఎం ఖట్టర్‌ ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. లోకకళ్యాణం కోసం చాతుర్మాస్య దీక్షను తపస్సులా చేపడుతున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. మహాభారతంలోని ముఖ్య ఘట్టాలతో కూడిన విగ్రహాలతో ప్రత్యేక ప్రదర్శన శాలను హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలో తమ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని వివరించారు. పంజాబ్‌ ప్రభుత్వం ప్రత్యేక కార్యదర్శి కే శివప్రసాద్‌, హర్యానా రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి టీవీఎస్‌ఎన్‌ ప్రపాద్‌ తదితరులు చండీగఢ్‌లో స్వాత్మానందేంద్ర స్వామిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు


SAKSHITHA NEWS