SAKSHITHA NEWS

లాకప్ రూముల్లో సీసీ కెమెరాలు పెట్టండి.. అన్ని రాష్ట్రాలకు *సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ: పోలీస్​ స్టేషన్లలోని ఇంటరాగేషన్, లాకప్​ రూముల్లో సీసీ కెమెరాలు పెట్టాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. సీబీఐ, ఎన్ఐఏ, ఈడీ వంటి విచారణ సంస్థల ఆఫీసుల్లోనూ సెక్యూరిటీ కెమెరాలు పెట్టాలని పేర్కొంది. కస్టడీలో నిందితులపై హింసను అరికట్టేందుకు సీసీ కెమెరాలతో పాటు ఆడియో రికార్డింగ్​ కూడా చేయాలని సూచించింది. దేశంలోని అన్ని పోలీస్​ స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్​ప్లేసులతో పాటు లాకప్​ రూములు, కారిడార్, స్టేషన్​ రిసెప్షన్​ ఏరియా, సబ్​ ఇన్​స్పెక్టర్, ఇన్​స్పెక్టర్​ రూమ్​లు, వాష్​ రూమ్​ బయట సీసీ కెమెరాలను అమర్చాలంది.

ఈ ఏర్పాట్లకు అవసరమైన నిధులు కేటాయించాలని, నిర్ణీత సమయంలోపల సీసీటీవీ కెమెరాలను అమర్చాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం ఆదేశించింది. ఈ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి యాక్షన్​ ప్లాన్​ను ఆరు వారాల్లోగా కోర్టుకు సమర్పించాలని పేర్కొంది. ఈ కెమెరాల్లో రికార్డైన పుటేజ్​ను, ఆడియో రికార్డింగ్​ను 18 నెలల పాటు జాగ్రత్త చేయాలని, అవసరమైతే కోర్టులకు ఎవిడెన్స్​గా అందజేయాలని పేర్కొంది. పోలీస్​ స్టేషన్లలో విచారణ సందర్భంగా మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా ఇండిపెండెంట్​ ప్యానెల్​తో తరచూ సీసీటీవీ ఫుటేజ్​ చెకింగ్​ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ప్రతీ జిల్లాలో హ్యూమన్​ రైట్స్​ కోర్టులను ఏర్పాటు చేయాలని ఆర్డర్​ వేసింది.

పంజాబ్​లో జరిగిన కస్టోడియల్​ డెత్​కు సంబంధించిన కేసు విచారణలో సుప్రీం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇంటరాగేషన్​ ఏరియాలలో కెమెరాల ఏర్పాటుకు 2018లోనే ఆదేశాలు జారీ చేసినా.. ఇప్పటి వరకూ అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఏర్పాట్ల సంబంధించిన వివరాలను వచ్చే నెల 27న పరిశీలిస్తామని కోర్టు తెలిపింది.


SAKSHITHA NEWS