SAKSHITHA NEWS

ముసాయిదా బిల్లు పై సలహాలు సూచనలను అందజేయాలి
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన ఆర్వోఆర్ చట్టం ముసాయిదా బిల్లు పై సలహాలు సూచనలను అందజేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. జిల్లా కలెక్టర్, కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో రెవిన్యూ అధికారులు, న్యాయవాదులు, నిపుణులతో నూతన రెవెన్యూ చట్టం-2024 ముసాయిదాపై వర్క్ షాప్ నిర్వహించారు.
నూతన రెవెన్యూ చట్టం-2024 ముసాయిదా బిల్లు లో పేర్కొన్న అంశాలు, ఈ బిల్లు తీసుకురావడంలో గల ఉద్దేశ్యాన్ని జిల్లా రెవెన్యూ అధికారిణి ఎం. రాజేశ్వరి వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భూ సమస్యల పరిష్కారం కోసం నూతన రెవెన్యూ చట్టం రూపొందించాలని ప్రభుత్వం సంకల్పించిందని, దేశంలో వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తమమైన భూ రికార్డుల నిర్వహణను పరిశీలించిన నిపుణుల బృందం నూతన రెవెన్యూ చట్టం- 2024 ముసాయిదా బిల్లును రూపొందించిందని తెలిపారు.

నూతన చట్టం రూపకల్పనలో ప్రజలను విస్తృతంగా భాగస్వామ్యం చేయాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు, గురువారం వర్క్ షాప్ నిర్వహించినట్లు ఆయన అన్నారు. భూ రికార్డుల నిర్వహణకు మెరుగ్గా ఉండే విధంగా ముసాయిదా బిల్లుపై రైతు సంఘాలు, మేధావులు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు (రిటైర్డ్& సర్వీస్) తమ సూచనలను అందజేయాలని కలెక్టర్ కోరారు. నూతన రెవెన్యూ చట్టం ముసాయిదా బిల్లుపై సలహాలు సూచనలు ఏమైనా ఉంటే వెంటనే రాతపూర్వకంగా కలెక్టరేట్ కార్యాలయానికి అందిస్తే, వాటిని ఒక నివేదిక రూపంలో సిద్ధం చేసి తుది చట్ట రూపకల్పన కోసం సీసీఎల్ఏ కు సమర్పిస్తామని కలెక్టర్ అన్నారు.


వర్క్ షాప్ లో పాల్గొన్న రెవెన్యూ ఉద్యోగులు, న్యాయవాదులు, రైతు సంఘాల నాయకులు తమ సూచనలు సలహాలు తెలిపారు. గ్రామంలోని ఆబాది భూముల రికార్డులు అప్డేట్ చేయాలని, సాదా బైనమా భూముల రిజిస్ట్రేషన్ రుసుం వసూలు చేయాలని, పోజిషన్ కాలం ఉండాలని, అప్పిలేట్ అథారిటీ ఆర్డిఓ స్థాయిలో ఉండాలని వారు అన్నారు. సమగ్ర భూ సర్వే చేపట్టాలని వారు కోరారు. భూ రిజిస్ట్రేషన్ మార్పులు, సంబంధిత గ్రామంలో ప్రచారం చేయాలని వారు తెలిపారు. వారసత్వ ముటేషన్లు ఉచితంగా చేయాలని, రెవిన్యూ రికార్డులు రెవెన్యూ గ్రామాల వారిగా కాకుండా, గ్రామాల వారిగా చేపట్టాలని అన్నారు. సాదా బైనామా దరఖాస్తులన్నిటిని పరిష్కరించాలని వారు తెలిపారు. నూతన ఆర్వోఆర్ చట్టం అమలు కోసం ప్రతి గ్రామంలో రెవెన్యూ ఉద్యోగి ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, భూ సమస్యల అప్పిలేట్ అథారిటీ జిల్లా స్థాయిలోనే ఉండే విధంగా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు జి. గణేష్, ఎల్. రాజేందర్, కలెక్టరేట్ ఏవో అరుణ, జిల్లాలోని తహసిల్దార్లు, న్యాయవాదులు, రైతు సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 08 22 at 18.05.38

SAKSHITHA NEWS