SAKSHITHA NEWS

హైదరాబాద్‌: రాష్ట్రంలోని 415 ఆలయాలకు నూతన పాలకవర్గాలను నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకట్రెండు నెలల్లోనే పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇంత భారీ సంఖ్యలో నియామకాలు చేపట్టటం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. అధిక సంఖ్యలో ఆలయాల పాలకవర్గాల పదవీకాలం గడువు ముగిసిన నేపథ్యంలో అధికారులు ఆ విషయాన్ని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకువచ్చారు. ఖాళీగా ఉన్న ఆలయాలకు దశలవారీగా నియామకాలు చేపట్టాలని ఆమె ఆదేశించడంతో అధికారులు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారు. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా నియోజకవర్గాల వారీగా జాబితాలను రూపొందిస్తారు. ఆ తర్వాత ఈ జాబితాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడితోపాటు ఆలయాన్ని బట్టి సభ్యుల సంఖ్య ఉంటుంది. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన అనంతరం పాలకవర్గాలు ప్రమాణస్వీకారం చేస్తాయి.

త్వరలో మరికొన్ని ఆలయాలకు..

చిన్నా పెద్ద కలిపి రాష్ట్రంలో 875 ఆలయాలకు ప్రభుత్వం పాలకవర్గాలను నియమించాల్సి ఉంది. వీటిలో 190 ఆలయాలకు పాలకవర్గ పదవీ కాలం ఇంకా మిగిలి ఉంది. మిగిలిన 685 ఆలయాలకు నియామకాలు చేపట్టాల్సి ఉండగా తొలిదశలో 415 ఆలయాలకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ చేశారు. మరో 270 ఆలయాలకు రెండో దశలో నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సమ్మక్క-సారక్క జాతర సందర్భంగా ఆ ఆలయ పాలకవర్గం ఇప్పటికే ప్రమాణస్వీకారం చేసిందని, సాధ్యమైనంత త్వరగా మిగతా నియామకాలను పూర్తి చేస్తామని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

WhatsApp Image 2024 02 18 at 1.07.10 PM

SAKSHITHA NEWS