Srivari Brahmotsavam 2022
2022 శ్రీవారి బ్రహ్మోత్సవాలు
4వ రోజు ఉదయం : కల్పవృక్షవాహనం
నాలుగవనాడు పగలు శ్రీదేవి భూదేవి సహితుడై మలయప్పస్వామి కల్పవృక్షవాహనంపై విహరిస్తూ భక్తులను అలరిస్తాడు.
ఎల్ల ఋతువులందు నెలరారి పరువమై కోరివచ్చువారి కోర్కుల నీనెడు వేల్పుమాను పాలివెల్లి బుట్టె” (దేవతలు, రాక్షసులు పాలసముద్రాన్ని అమృతం కొరకు చిలుకుతున్నప్పుడు అన్ని ఋతువులలోను పచ్చగానుండి కోరినవారి కోరికలను తీర్చునట్టి కల్పవృక్షం పాలసముద్రం నుండి పుట్టినది.)
కల్పవృక్షం ఐహిక సుఖాలను మాత్రమే ప్రసాదిస్తుంది.
కల్పవృక్ష వాహనం మీద నున్న వేంకటేశ్వరుడు ఐహిక, ఆముష్మిక సుఖములను ప్రసాదిస్తాడు. స్వామి ఆశ్రిత జన కల్ప వృక్షం. భక్తజనమందారం.
వేంకటేశ్వర స్వామి (శ్రీమన్నారాయణుని అర్చావతారం) కృష్ణావతారంలో సత్యభామ కోరికను తీర్చడంకోసం పారిజాతవృక్షాన్ని దివి నుండి భువికి దెచ్చి ప్రతిష్ఠించాడు. ఇప్పుడు కలియుగంలో ఆశ్రితభక్తజనుల కోరికలను తీర్చడం కోసం కల్పవక్షవాహనంపై విహరిస్తున్నాడు.
స్వామి కల్పవృక్షవాహనంపై గోవులను కాపాడుతున్న గోపాలుని రూపంలో భక్తులకు కనువిందు చేస్తాడు. (ఈ ఆలంకారము మారుతుంటుంది).
గోవులను కాపాడిన గోవిందుడు భక్తజనులను కాపాడుతాడు.
ఈ కలియుగంలో ఆశ్రితజన కల్పవృక్షమైన వేంకటేశ్వరస్వామి భక్తజనుల కోరికలను తీరుస్తుంటాడు. భక్తులపాలిట కల్పవృక్షమే వేంకటేశ్వరుడు. “పండిన పెరటి కల్పకము వాస్తవ్యుండు” అన్నట్లుగా స్వామి దేవేరీ సమేతుడై భక్తజనులకు పెరటి కల్పవృక్షంగా కోరికలు దేర్చే చింతామణిగిరి (వేంకటాద్రికినామాంతరం) పై ఉన్నాడు.