SAKSHITHA NEWS

నిజాయితీకి నిలువెత్తు దర్పణం శ్రీవల్లి

నిజాయితీకి నిలువెత్తు సాక్ష్యంగా పని చేసిన పద్మనాభం మండల ఎమ్మార్వో శ్రీవల్లిని అందరూ కొనియాడుతున్నారు. పేదల పాలిట పెన్నిధిగా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ధీర మహిళగా తనదైన ముద్ర వేసుకున్నారు శ్రీవల్లి. నీతి నిజాయితీకి పోయే ఆమెను కొంతమంది అక్రమార్కులు కలిసికట్టుగా చేరి ఆమెను ఎలాగైనా వేరేచోటకు పంపించేయాలని పథకం పన్నారు. అదే అదునుగా స్థానిక ఎమ్మెల్యే సహకారం తీసుకుని పై స్థాయిలో పావులు కదిపారు. చివరకు వారు అనుకున్నదే అయింది. ఫలితంగా శ్రీవల్లికి బదిలీ వేటు వేసి గాజువాక మండలానికి పంపించారు. ఈ పరిణామంతో అక్రమార్కులు సంబరాలు చేసుకుంటున్నారు. భూకబ్జాలు, వైట్ కాలర్ నేరాలకు పాల్పడే అక్రమార్కులు యధాలాపంగా వారి పని కానిస్తున్నారు. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే శ్రీవల్లిని బదిలీ చేయడం పట్ల పలువురు విస్మయం చెందుతున్నారు. ఈ ఏడాది మార్చి 31వ తేదీన పద్మనాభం ఎమ్మార్వో గా బాధ్యతలు చేపట్టిన శ్రీవల్లి కొద్దికాలంలోనే రెవెన్యూ రికార్డులు సరిచేసి బాగోతాలను ఉన్నతాధికారులకు నివేదించారు. అసలైన పేదలకు మేలు కలిగేలా చూశారు. దీంతో మండల ప్రజల చేత సెహభాష్ అనిపించుకున్నారు. ఏది ఏమైనా శ్రీవల్లి తనదైన మార్క్ వేసుకున్నారని చెప్పవచ్చు.


SAKSHITHA NEWS