నగరంలో నిర్మిస్తున్న మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్లానింగ్ అధికారులతో సాయంత్రం కమిషనర్ హరిత ఐఏఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తిరుపతి నగరంలో ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తొలగించేందుకు నూతన మాస్టర్ ప్లాన్ రోడ్లను తీసుకురావడం జరిగిందన్నారు. అదేవిధంగా అంతర్గత రోడ్లను వెడల్పు చేయడం జరుగుతున్నదని అన్నారు. రహదారుల నిర్మాణాల పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారని, అయితే నిర్మాణాల్లో మరింత వేగం పెంచాలని అన్నారు.
మాస్టర్ ప్లాన్ రోడ్ల కొరకు స్థలాలు ఇచ్చిన యజమానులకు అర్హులైన వారికి వెంటనే టి.డి.ఆర్. అందజేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా నగరంలో ఇకపై ఎక్కడ గాని ఆక్రమణలు జరగకుండా నిరంతరం పర్యవేక్షించేలా ఉండాలని, ఇప్పటికే రహదారులను ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ప్లానింగ్ అధికారులు పనిచేయాలన్నారు. నగరంలో వస్తున్నటువంటి రహదారుల ఆవశ్యకతను ప్రజలందరికీ వివరించాలని, ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకొని మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణల పూర్తికి కృషి చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ సిటి ప్లానర్ శ్రీనివాసులు రెడ్డి, అసిస్టెంట్ సిటి ప్లానర్ బాలసుబ్రమణ్యం, సర్వేయర్ కోటేశ్వర రావు, ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.