SAKSHITHA NEWS

special-committee-formed-for-inspections-in-krishna-district-industries-collector-ranjit-basha

కృష్ణాజిల్లా పరిశ్రమలలో తనిఖీలకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు !!
— కలెక్టర్ రంజిత్ బాషా

  • పూర్తిస్థాయి ప్రమాణాలు పాటించాల్సిందే
  • ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు
  • కలెక్టర్‌ పి. రంజిత్ బాషా స్పష్టీకరణ

పరిశ్రమల్లో కార్మికుల భద్రత, కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ తదితరాలకు సంబంధించి నియమ నిబంధనలను విధిగా పాటించాలని, ఏ ఒక్కరైనా ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కృష్ణాజిల్లా కలెక్టర్‌ పి.రంజిత్ బాషా స్పష్టం చేశారు.

      మచిలీపట్నం :  కలెక్టర్ బంగ్లాలో పరిశ్రమలు, కర్మాగారాలు, కాలుష్య నియంత్రణ, విపత్తుల నిర్వహణ తదితర శాఖల అధికారులతో పాటు జిల్లాలోని వివిధ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలో ఒక్క ప్రమాదం కూడా జరక్కుండా చూడాలని కలెక్టర్‌ సూచించారు. భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పని ప్రదేశాలను అత్యంత సుర క్షితంగా ఉండేలా చూసుకోవాలని, చిన్నపాటి నిర్లక్ష్యం పెను ప్రమాదానికి దారి తీయొచ్చనే విషయాన్ని గుర్తించి, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. త్వరలో జిల్లాలోని అన్ని పారిశ్రామిక యూనిట్లలో సేఫ్టీ ఆడిట్‌, తనిఖీలు చేపట్టేందుకు జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లాస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌, డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌, డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌, ఏపీపీసీబీ ఎన్విరాన్‌ మెంటల్‌ ఇంజీనీర్‌, జిల్లా అగ్నిమాపక అధికారి, ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌ తదితరులు సభ్యులుగా ఉంటారని వివరించారు. అత్యంత పారదర్శకంగా భద్రత, పర్యావరణ హిత చర్యలపై ఆడిట్‌ జరగనుందని వెల్లడించారు. 


 అత్యంత ప్రమాదకర పరిశ్రమలతో ప్రారంభించి దశల వారీగా అన్ని పరిశ్రమల్లోనూ చెక్‌ లిస్ట్‌ల ప్రకారం నిరంతర తనిఖీలు చేపట్టనున్నట్లు తెలిపారు. భద్రతా వ్యవస్థల పనితీరుపై అప్రమత్తత, పర్యవేక్షణ అవసరమని ఆ దిశగా పరిశ్రమల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటర్‌ లాకింగ్‌, అలారమ్‌ వంటి వ్యవస్థలను ఆధునికీకరించు కోవాల్సిన అవసరముందన్నారు. పరిశ్రమల్లో వివిధ విభాగాల్లో పని చేసేందుకు నిబంధనల మేరకు ఆయా కార్యకలాపాలపై నైపుణ్యమున్న వారిని మాత్రమే నియమించుకోవాలని స్పష్టం చేశారు. కార్మికుల భద్రతతో పాటు సంక్షేమానికి సంబంధించి అన్ని నిబంధనలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్‌ సూచించారు. 

  ఇండస్ట్రియల్ సేఫ్టీ ఆడిట్ క్రింద ఎక్కువగా కాలుష్యం విడుదల చేస్తున్న  రెడ్, ఆరంజ్ కేటగిరీల పరిశ్రమల్లో రక్షణ పరికరాలను ఎప్పటికప్పుడు తనిఖీ  చేసి 3 నెలల్లో స్పష్టమైన నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.

  ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరి జయరాం, రాష్ట్ర పరిశ్రమల శాఖ చీఫ్ సెక్రటరీ, కార్మిక శాఖ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA NEWS